
పిడుగు పడి ఇద్దరు కూలీలు..
అచ్చంపేట: పదర గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు పదర గ్రామానికి చెందిన రైతు పోగుల వినోద్ పొలంలో వేరుశనగ పంట తీసేందుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కూలీలు కొంత మంది చెట్ల కింద తలదాచుకోగా.. చెట్ల కింద పిడుగులు పడుతాయనే ఉద్దేశంతో వర్షంలోనే ఒకే దగ్గర నిల్చున్న సుంకరి సైదమ్మ(45), గాజుల వీరమ్మ(55), సుంకరి లక్ష్మమ్మలపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను వెంటనే పదర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంతో కోడోనిపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. పదర ఎస్‌ఐ సర్దామ్, ఆర్‌ఐ శేఖర్ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు.
గేదెలు మేపేందుకు వెళ్లి..
మానవపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన సంఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చంద్రశేఖర్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) గేదెలను మేపేందుకు గురువారం వెళ్లాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు భార్య లక్ష్మీదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ చంద్రకాంత్‌ను సంప్రదించగా ఫిర్యాదు అందలేదని చెప్పారు.
తుంగభద్ర తీరంలో మరొకరు..
శాంతినగర్: వడ్డేపల్లి మండలంలోని బుడమర్సు గ్రామానికి చెందిన మాదిగ రాజు, తిమ్మక్కల చిన్న కుమారుడు మహేంద్ర(21) గురువారం గేదెలు మేపడానికి తుంగభద్ర నదీతీరానికి వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు మహేంద్ర సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా మహేంద్ర రాకపోవడంతో కుంటుంబ సభ్యులు తుంగభద్ర నదితీరానికి వెళ్లి చూడగా విగతజీవుడై కనిపించడంతో బోరున విలపించారు.

పిడుగు పడి ఇద్దరు కూలీలు..

పిడుగు పడి ఇద్దరు కూలీలు..

పిడుగు పడి ఇద్దరు కూలీలు..