
7వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వ్యవసాయశాఖ అధికారులతో పాటు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, ఏపీఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 7వ తేదీ నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలను తెరవాలని అన్నారు. ఈ యాసంగిలో వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరను ప్రకటించాయన్నారు. సన్నధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాల్‌కు రూ.500లు ప్రభు త్వం బోనస్ ప్రకటించినట్లు తెలిపారు. గత ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో గుర్తించిన లోపాలను రబీ ధాన్యం సేకరణ సందర్భంగా సరి చేసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో సన్నరకం ధాన్యం నింపే గోనె సంచులను ఎర్ర దారంతో, దొడ్డు రకం ధాన్యం నింపు సంచులను ఆకు పచ్చదారంతో కుట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, డీఎస్‌ఓ వెంకటేష్, డీఆర్డీఓ నర్సింహులు, అడిషనల్ డీఆర్డీఓ జోజప్ప, అధికారులు, ఐకేపీ మహిళలు హాజరయ్యారు.
రూ.4 లక్షల వరకు రుణాలు
రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిందని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఆన్‌లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 14వ తేదీలోగా సమర్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని సూచించారు. ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కాస్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డ్ తప్పనిసరి అని తెలిపారు. దరఖాస్తు హార్డ్ కాపీని ఎంపీడీఓ కార్యాలయంలో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఛత్రునాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.
అధికారులు, సిబ్బంది అందుబాటులోఉండాలి
కలెక్టర్ విజయేందిర బోయి