
కుంటలో పడి రైతు మృతి
గోపాల్‌పేట: మోటారు బాగుచేసేందుకు కుంటలోకి దిగిన ఓ రైతు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన మండలంలోని బుద్ధారం లక్ష్మీతండాలో వెలుగుచూసింది. ఎస్‌ఐ నరేష్ కుమార్ వివరాల మేరకు.. బుద్ధారం లక్ష్మీతండాకు చెందిన కోటయ్య చిన్న కుమారుడు కిషన్ (39), అతడి భార్యకు చిన్నచిన్న గొడవలు జరగడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఐదారు నెలలుగా కిషన్ లక్ష్మీతండాలో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. గ్రామ సమీపంలోని కొత్తకుంటలో తన చిన్నాన్న బోరుమోటారు పనిచేయకపోవడంతో మంగళవారం సరిచేసేందుకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. అతడి కోసం స్థానికులు గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. బుధవారం కుంటలో అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి కోటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు..
రాజోళి: పురుగు మందు తాగి చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం రాత్రి మృతిచెందినట్లు ఏఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. రాజోళికి చెందిన వీరన్న(23)కు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో ఏడాది కిత్రం ఆయనకు పచ్చకామెర్లు వచ్చాయి. అయినా కూడా మద్యం సేవిస్తుండటంతో తల్లి ఎన్నో సార్లు మందలించింది. క్రమేణా తన ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఈ నెల 5న పురుగుమందు తాగాడు.చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి..
గోపాల్‌పేట: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఏదుల మండలం చెన్నారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. రేవల్లి హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన అబ్దుల్ అలీం (35) ఇంట్లోనే చికెన్ విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. బుధవారం ఎప్పటిలాగే చికెన్ డ్రెస్సింగ్ మిషన్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడే పడిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే కారులో వనపర్తి ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అలీంకు భార్య ఫర్జానాబేగం, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి అబ్దుల్ రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ వివరించారు.