
పబ్బతి అంజన్న.. పాహిమాం
అచ్చంపేట/మన్ననూర్: చారిత్రాక ప్రాశస్త్‌య్రం కలిగి ప్రకృతి రమణీయ ప్రదేశంలో పబ్బతి ఆంజనేయస్వామి కొలువుదీరారు. కష్టాలను కడతేర్చే ఇష్టదైవంగా ఇక్కడి ప్రజలు ఆరాధిస్తారు. అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని మద్దిమడుగులో ఉన్న ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. గిరిజనులనేగాక నాగరీకులు, పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచేగాక నల్గొండ, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. నల్లమల కొండల్లో కృష్ణానది పశ్చిమ భాగాన దుంధుబి నది సంఘమించే రెండు నదుల కలయిక నడుమ శ్రీశైలం పుణ్య క్షేత్రానికి ఉత్తర దిశలో ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1120లో గుర్తించినట్లు.. పురాతన దేవాలయం కనుగొని ఓ చెట్టు కింద విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
ఏటా రెండు పర్యాయాలు..
మద్దిమడుగు అభయాంజనేయస్వామి ఉత్సవా లు ఏటా రెండు పర్యాయాలు పవిత్ర కార్తీక మాసం, చైత్రమాసంలో జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు ఆంజనేయస్వామి మాలలు ధరిస్తారు. మాలధారుల సంఖ్య ప్రతి సంవత్సరం ఊహకందని విధంగా పెరిగిపోయింది. ఉత్సవాల సందర్భంగా మాచర్ల, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, హైదరాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. చైత్రమాసం బ్రహ్మోత్సవాలు 10 నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దేశావత్ రాములునాయక్, ఈఓ నర్సింహులు తెలిపారు.
కోట మైసమ్మ ఆలయం..
ఆంజనేయస్వామి ఆలయ ప్రదేశంలోనే కోట మైసమ్మ అమ్మవారు వెలిశారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. చాలామంది భక్తులు ఇక్కడ కోళ్లు, మేకలు సమర్పిస్తారు.
భక్తుల ప్రగాడ విశ్వాసం..
స్వామివారిని దర్శించుకొని ఆలయం ఎదుట ఉన్న చెట్టుకు ఉయ్యాల కడితే సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. అలాగే కోరిన కోర్కెలు తీరాలని ముడుపులు కట్టి.. తీరగానే ఆ ముడుపులను వారే స్వయంగా విప్పుతారు. ఆవు పాలు, నెయ్యి, బెల్లం, తేనె, గోధుమ రొట్టెలతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
కార్యక్రమాలు ఇలా..
10న గురువారం అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు అశ్వవాహనసేవ, శివపార్వతుల కల్యాణం
11న శుక్రవారం గవ్యాంతపూజ, ద్వాదశ వాస్తుపూజ, హోమం, రుద్రహోమం, మన్యసూక్తి హోమం, బలిహరణం, సహస్ర నామార్చన, రాత్రి 8 గంటలకు స్వామివారి వాహనసేవ, సీతారాముల కల్యాణం
12న శనివారం హన్‌మాన్ జయంతి రోజున ఉదయం 9 గంటలకు స్వామివారికి మహాకుంభాభిషేకం, శ్రీ హనుమాన్ గాయత్రి మహాయజ్ఞంలో పూర్ణాహుతి, హనుమాన్ దీక్షదారుల మాల విరమణ. మూడు రోజులు సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు
నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
నల్లమల కొండల్లో కొలువుదీరిన స్వామివారు
వేలాదిగా తరలిరానున్న భక్తులు

పబ్బతి అంజన్న.. పాహిమాం