
చివరి 40 మీటర్ల వరకు చేరితేనే ఆనవాళ్లు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ)సొరంగం లోపల బుధవారం సైతం సహాయక చర్యలు కొనసాగాయి. 54 రోజులుగా ఆరుగురి కార్మికుల ఆచూకీ కోసం సహాయక సిబ్బంది నిర్విరామంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఇంత వరకు ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికులు నిషేధిత ప్రదేశం 40 మీటర్ల పరిధిలో ఉన్నారనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, ఈనెల 20 వరకు ప్రభుత్వం విధించిన గడువులోగా తవ్వకాలు పూర్తి చేసేందుకు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. 50మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు మేర సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. సొరంగం లోపల ఐదు ఎస్కవేటర్లు, బాబ్ క్యాట్లు బండరాళ్లను తొలగిస్తుండగా.. డీ2 ప్రదేశంలో తొలగించిన శిథిలాలను కన్వేయర్ బెల్టు ద్వారా సొరంగం బయటకు తరలిస్తున్నారు. అలాగే, ప్లాస్మా కట్టర్‌తో టీబీఎం బాగాలు కత్తిరించి స్టీల్, బండరాళ్లను లోకో ట్రైన్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. ఇచ్చిన టాస్క్ ప్రకారం నిషేధిత ప్రదేశం వరకు ఉన్న శిథిలాలను తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమైయ్యారు. శిథిలాల కింద ఇప్పటి వరకు ఆరుగురి కార్మికుల అచూకీ లభ్యం కాలేదు. సహాయక చర్యలు చేపట్టి సుమారుగా రెండు నెలలు కావస్తుండటం, కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో సహాయక బృందాల్లో రోజురోజుకు టెన్షన్ పెరుగుతుంది. చివరి వరకు తవ్వకాలు చేపడితే తప్పా అచూకీ లభ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
బండరాళ్లు తొలగించే ప్రక్రియ వేగవంతం
సొరంగం లోపల సహాయక సిబ్బంది బండరాళ్లు తొలగించే ప్రక్రియను వేగవంతం చేశామని ప్రత్యేక అధికారి శివశంకర్ అన్నారు. దోమల పెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఇన్‌లేట్ వద్ద బుధవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సొంరంగం లోపల చేపడుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తి సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారని, విధిగా ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్,విజయ్‌కుమార్,జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్‌కుమార్ సింగ్,సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య,ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి,హైడ్రా అధికారి,దక్షణ మద్య రైల్వే అధికారి రవింద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌బీసీలో కార్మికుల జాడ కోసం 54 రోజులుగా సహాయక చర్యలు

చివరి 40 మీటర్ల వరకు చేరితేనే ఆనవాళ్లు