
ఐతోల్‌లో భవన నిర్మాణ కార్మికుడి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: భవన నిర్మాణ పనులకు వచ్చిన కార్మికుడు మృతి చెందిన సంఘటన తాడూరు మండల పరిధిలోని ఐతోలులో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామానికి చెందిన సంపంగి రాములు (32) ఐతోల్‌లో నిర్మాణమవుతున్న ప్రైవేటు పాఠశాల భవనంలో కూలీ పనికోసం వెళ్లాడు. అస్వస్థతకు గురై కింద పడిపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. భవన యజమాని లక్ష్మారెడ్డి గురువారం రాత్రి వరకు పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో కుటుంబసభ్యులు జిల్లాకేంద్రంలోని ప్రధానరహదారిపై ధర్నాకు దిగారు. యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో.. అక్కడికి చేరకున్న పోలీసులు అక్కడి వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
న్యాయం చేయాలని జిల్లాకేంద్రంలో ధర్నా