
59 రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ
అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 59 రోజులుగా సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నా.. గల్లంతైన ఆరుగురి కార్మికుల జాడ లభించడం లేదు. 13.936 కి.మీ. వద్ద కంచె ఏర్పాటు చేసిన నిషేధిత డీ–1 ప్రదేశంలో 43 మీటర్లు మినహా మిగతా ప్రాంతంలో టీబీఎం ప్లాట్‌ఫాం భాగాలతో పాటు మట్టి, బురద, బండరాళ్లను తొలగించి బయటికి తరలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సుమారు 450 మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. పైకప్పు కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తే.. మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని జీఎస్‌ఐ సర్వే విభాగం తేల్చిచెప్పడంతో అక్కడ ఇప్పట్లో పనులు చేపట్టే అవకాశం లేదు. సొరంగంలో ఏర్పడిన గండి నుంచి ఉబికి వస్తున్న నీటి ఊటను భారీ మోటార్ల సాయంతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత నీటిఊటను అలాగే వదిలేస్తే.. నిషేధిత ప్రాంతం మరింత బురదగా మారుతుందని రెస్క్యూ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ప్రమాద ప్రదేశం నుంచి 324 మీటర్ల వరకు శిథిలాలు పేరుకుపోయి ఉండగా.. ఇప్పటి వరకు 281 మీటర్ల మేర మట్టి, బురద, బండరాళ్లు, టీబీఎం ప్లాట్‌ఫాంం భాగాలను తొలగించారు. 13.850 కి.మీ. నుంచి 13.936 కి.మీ. మధ్య సొరంగం పైకప్పు కూలిన ప్రదేశం క్రిటికల్ జోన్‌గా గుర్తించారు. 43 మీటర్ల వద్ద గల్లంతైన ఆరుగురి కార్మికులు ఉండవచ్చని భావిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో
కొనసాగుతున్న సహాయక చర్యలు