
సివిల్స్‌లో మెరిసిన పాలమూరు బిడ్డలు
సాక్షి, నాగర్‌కర్నూల్/వెల్దండ/వంగూరు/అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. నల్లమలలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన మండలి సాయికిరణ్ మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 298 ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసిన సాయికిరణ్.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం విశేషం. సాయికిరణ్ తల్లి పుష్పమ్మ గృహిణి కాగా.. తండ్రి మండలి లింగమయ్య ప్రస్తుతం పెద్దకొత్తపల్లి మండలంలో ఎంపీఓగా పనిచేస్తున్నారు.
● వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్యావత్ యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించారు. ఆయన గతేడాది యూపీఎస్సీ ఫలితాల్లో 627వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌గా మహారాష్ట్రకు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ లక్ష్యంగా మరోసారి యూపీఎస్సీ పరీక్ష రాసి.. మెరుగైన 432వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని యశ్వంత్ నాయక్ చెప్పారు. కాగా, యశ్వంత్ తండ్రి ఉమాపతి హైదరాబాద్‌లో ఎస్పీఐ ఏజీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్, ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
● వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన గోకమొల్ల ఆంజనేయులు పట్టుదలతో చదివి ఆలిండియా 934వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆంజనేయులు.. 1నుంచి 7వ తరగతి వరకు స్వగ్రామమైన తిప్పారెడ్డిపల్లిలో.. 8నుంచి 10వ తరగతి వరకు గాజరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, ఐఐటీని కడప జిల్లా ఇడుపులపాయలో పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. సివిల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ చాటడంతో ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసులు, కృష్ణమ్మతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు.
ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నా..
నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ సాధించాలని లక్ష్యం ఉండేది. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశాక.. ఎంబీఏ చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధం అయ్యాను. ఏడాదిపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుని ఇంటి వద్దే ఉండి ప్రిపేర్ అయ్యాను. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం ఆనందంగా ఉంది. – సాయికిరణ్, మన్ననూర్
●
● మూసాపేట మండలం నిజాలాపూర్‌కు చెందిన మునుగల్‌చేడ్ సత్యయ్య, యశోద దంపతుల కుమారుడు ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ జాతీయ స్థాయిలో 700 ర్యాంకు సాధించారు. గత మార్చి 30న విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించిన అతడు.. ఈసారి యూపీఎస్సీ ఫలితాల్లోనూ సత్తా చాటారు. ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ ఫిజిక్స్), పీజీ పూర్తి చేశారు. మొదటిసారి యూపీఎస్సీ పరీక్ష రాసి 700 ర్యాంకు సాధించారు. ఇదిలా ఉంటే, వెంకటేశ్ ప్రసాద్ తండ్రి సత్యయ్య ప్రస్తుతం కోయిలకొండ మండలంలో ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తుండగా.. తల్లి యశోద గృహిణి. పదేళ్లుగా సత్యయ్య కుటుంబంతో కలిసి మహబూబ్‌నగర్‌లోని శేషాద్రినగర్‌లో నివాసముంటున్నారు.
ఐఏఎస్ కావడమే లక్ష్యం..
అమ్మా, నాన్న పోత్సాహంతో చదువులో రాణించాను. దూర ప్రాంతాల్లో నా విద్యాభ్యాసం పూర్తిచేశాను. యూపీఎస్సీ పరీక్ష కోసం ఢిల్లీలోని వాజీరాం కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నా. 15 నెలలపాటు కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే 700 ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ఇందుకోసం మరోసారి ప్రయత్నం చేస్తాను. – ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ ,నిజాలాపూర్

సివిల్స్‌లో మెరిసిన పాలమూరు బిడ్డలు

సివిల్స్‌లో మెరిసిన పాలమూరు బిడ్డలు

సివిల్స్‌లో మెరిసిన పాలమూరు బిడ్డలు