
పీసీసీ అబ్జర్వర్ల నియామకం
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ అబ్జర్వర్ల జాబితాను ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు దొమ్మటి సాంబయ్య, గజ్జి భాస్కర్ యాదవ్, నాగర్‌కర్నూల్‌కు టి.బెల్లయ్య నాయక్, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, వనపర్తికి ఎ.సంజీవ్ యాదవ్, గౌరి సతీశ్, జోగుళాంబ గద్వాలకు దీపక్ జైన్, బి.వెంకటేశ్ ముదిరాజ్, నారాయణపేటకు ఎం.వేణుగౌడ్, బొజ్జ సంధ్యారెడ్డి పార్టీ అబ్జర్వర్లుగా కొనసాగనున్నారు. వీరు పార్టీ తరఫున ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేయనున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల పనితీరును అధిష్టానానికి నివేదించనున్నారు.
స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా నుంచి వివిధ జిల్లాలకు ఇప్పటికే 8 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా, వివిధ జిల్లాల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు 21 మంది ఉపాధ్యాయులు బదిలీపై రానున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం 20 మంది ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో రిపోర్టు చేయగా.. ఒక ఉపాధ్యాయుడు రాలేదని డీఈఓ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా.. బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు వివిధ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్కులు, స్పౌజ్ సర్వీస్ బుక్‌లను పరిశీలన కమిటీ తనిఖీ చేసింది. అనంతరం గురువారం సాయంత్రం నాటికి వీరి బదిలీకి సంబంధించిన ఆర్డర్స్ కాపీలను అందజేయనున్నారు. ఈ ప్రక్రియను డీఈఓ ప్రవీణ్‌కుమార్, సూపరిటెండెంట్ శంబూప్రసాద్ పర్యవేక్షించారు.
చెంచుల స్థితిగతులపై అధ్యయనం
మన్ననూర్: నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల జీవన స్థితిగతులపై బుధవారం రాష్ట్ర అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు అధికారుల బృందం అప్పాపూర్, భౌరాపూర్ చెంచు పెంటల్లో చెంచులతో సమావేశమై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. చెంచుల జోవనోపాదులతో పాటు జీవన భృతి తదితర అంశాల గురించి చర్చించారు. చెంచు పెంటల్లో తాగునీరు, రవాణా, రోడ్లు, చెక్‌డ్యాంలు తదితర సౌకర్యాల కల్పనతో పాటు నేచర్ గైడ్ల శిక్షణ కోసం రూ. 1.2కోట్లు మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ జాయింట్ సెక్రెటరీ భవానీ శంకర్, పవన్‌సింగ్, ఫైనాన్స్ అధికారి శ్రీనివాస్, ట్రైబల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, ఇస్కాన్ సభ్యులు, మిషన్ భగీరథ డీఈ హేమలత, రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ అబ్జర్వర్ల నియామకం