దంచికొడుతున్న ఎండలు, ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు.. తస్మాత్‌ జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

దంచికొడుతున్న ఎండలు, ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు.. తస్మాత్‌ జాగ్రత్త!

Published Tue, Apr 18 2023 12:18 AM | Last Updated on Tue, Apr 18 2023 11:30 AM

- - Sakshi

మంచిర్యాలటౌన్‌/నిర్మల్‌చైన్‌గేట్‌: ఏప్రిల్‌ మాసంలోనే భానుడు భగ్గుమంటుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇప్పుడే 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే మాసంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వడదెబ్బ అంటే..
ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైతే శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడాన్ని వడదెబ్బ అంటారు. వేడి వాతావరణం లేదా చురుకై న పనులతో కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలతో శరీర ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తుంది.

లక్షణాలు
వడదెబ్బ తాకిన వారి కాళ్లు వాపులు వస్తాయి. కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరిగితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి సత్వర వైద్యం అందించాలి.

ప్రాథమిక చికిత్స

● వడదెబ్బ తగిలిన వ్య క్తిని వెంటనే నీడకు తీ సుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. వదులుగా ఉన్న నూలు దుస్తులు వే యాలి.

● ఫ్యాను గాలి లేదా చల్ల ని గాలి తగిలేలా ఉంచాలి.

● ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం, గ్లూకోజ్‌ ద్రావణం లేదా ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ద్రావణం (ఓఆర్‌ఎస్‌) తాగించవచ్చు.

● వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి.

తేలికపాటి ఆహారం ఉత్తమం
వేసవిలో సాధ్యమైనంత వరకు నూనెతో తయారు చేసిన పదార్థాలు, వేపుళ్లు, చిప్స్‌, జంక్‌ఫుడ్‌ వంటి వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలను బయటకు పంపించవద్దు. వేసవి వేడిని తట్టుకునేందుకు నూనెలేని, తేలికపాటి ఆహారాన్ని పిల్ల లకు అందించాలి. డీఫ్రిజ్‌లో ఉంచిన వాటిని వెంటనే తినడం, తాగడం వంటివి చేయవద్దు. సాధారణ ఉష్ణోగ్రత కంటే కొంచెం చల్లగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. బాగా చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి.

నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారం మేలు..
● నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీరదోస, కర్బూజ, తాటి ముంజలు, బీరకాయలు, పొట్లకాయలు వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీని వల్ల కడుపు నిండినట్లుగా ఉండి, డైట్‌ కంట్రోల్‌ అవుతుంది.

● శీతల పానీయాలు, అధికంగా షుగర్‌ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.

● వేసవిలో ఆకలి తక్కువగానూ దాహం ఎక్కువగానూ ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్‌ పాటిస్తూ కాలానికి అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండి బరువును నియంత్రించవచ్చు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మానుష్యంగా రోడ్డు

బారిన పడకుండా ఉండాలంటే...
● వేసవిలో డీహైడ్రేషన్‌ అధికంగా ఉంటు ంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీ రు తాగాలి. భోజనం మితంగా చేయాలి.

● ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడలో ఉండేందుకు ప్రయత్నించండి.

● గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు ఉన్నవారి శరీరాలకు అధిక సూర్యరశ్మి ప్రభావించి శరీరం త్వరగా డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో వ్యాధి తీవ్రతలు అధికంగా ఉంటాయి.

● ఆల్కహాల్‌, సిగరేట్‌, కార్బోనేటెడ్‌ వంటి ద్రావణాలకు దూరంగా ఉండాలి.

● ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్‌గ్లాసెస్‌, తలకు టోపీ వంటివి ధరించాలి.

● వేసవిలో ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలి.

● వేడి వాతావరణంలో శారీరక శ్రమ చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 5 నిమి షాలు నీడలో ఉండేలా చూసుకోవాలి.

● ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కారం, మసాలాలు లేకుంటే ఉత్తమం.

● ప్రయాణాల్లో సోడియం, ఎలక్ట్రోలైట్‌ ద్రావణాలను తాగడం మంచిది.


చేయకూడని పనులు
● మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో బయట ఎక్కువగా తిరగరాదు.

● రోడ్లపై విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగవద్దు.

● రోడ్లపై అమ్మే కలుషిత ఆహారం తినవద్దు. ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తినడం మంచిది.

● ఆహారంలో మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

జాగ్రత్తలు
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరమైతే తలకు టోపీ ధరించి వెళ్లాలి. కొబ్బరి నీరు, ఉప్పు, చక్కెర, నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవి ఫ్లూయిడ్స్‌ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాం. నవజాత శిశువులను పల్చటి గుడ్డతో సగం వరకు కప్పి ఉంచాలి. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.
– డాక్టర్‌ సుబ్బరాయుడు, మంచిర్యాల జిల్లా వైద్యాధికారి

రోజుకు ఎనిమిది లీటర్ల నీరు తాగాలి
వేసవిలో రోజుకు ఎనిమిది లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. తెల్ల ని కాటన్‌ దుస్తులను మాత్రమే ధరించా లి. బీపీ, షుగర్‌, గుండెజబ్బులు ఉన్న వారు ఎండలో ప్రయాణం చేయడం మంచిదికాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలంటే తలకు టోపీ, తల పాగా ధరించాలి. వడదెబ్బకు గురైనట్లు గుర్తించిన వెంటనే సమీపంలోని వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలి.

– డాక్టర్‌ రత్నాకర్‌,జనరల్‌ ఫిజీషియన్‌, నిర్మల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement