
మంచిర్యాల: చదువుకోవడం ఇష్టంలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నెల్కివెంకటాపూర్‌కు చెందిన బూసారపు శ్రీనివాస్ కుమార్తె శ్రావ్య (17) లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆమెకు చదువుపట్ల శ్రద్ధ లేకపోవడంతో కొద్దిరోజులుగా కళాశాలకు సరిగా వెళ్లడంలేదు.
తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపించినా మళ్లీ మూడురోజులుగా ఇంటివద్దే ఉంటోంది. తండ్రి శ్రీనివాస్ మందలించడంతో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లి దండ్రులు ముందుగా లక్సెట్టిపేటకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.