ఘటన స్థలంలో వివరాలు సేకరిస్తున్న అధికారులు
మంచిర్యాల: గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెండవ డివిజన్ గుండ్లసింగారంలో గురువారం జరిగిన కాల్పుల ఘటన మంచిర్యాల జిల్లాలోనూ కలకలం రేపింది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవ్వలేదని ఓ కానిస్టేబుల్ పోలీసు సర్వీస్ రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వరంగల్ నగరంలోని కీర్తినగర్‌కు చెందిన అడ్డె ప్రసాద్‌కు గుండ్లసింగారానికి చెందిన రమాదేవితో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రసాద్‌తోపాటు అత్త కుటుంబసభ్యులు గుండ్లసింగారంలో వేర్వేరు ఇళ్లలో అద్దెకు ఉంటున్నారు. ప్రసాద్ మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలం క్రితం ప్రసాద్ తన అత్త కమలాదేవి(58)కు రూ.4లక్షల అప్పుగా ఇవ్వగా తిరిగి ఆమె ఇవ్వలేదు. దీంతోపాటు అతని కాపురంలోనూ విభేదాలు వచ్చాయి.
వారిపై కోపం పెంచుకున్న ప్రసాద్ అత్తతోపాటు భార్య, బావమరిదిని టార్గెట్ చేశాడు. అత్తను చంపిన తర్వాత ఇంట్లోనే ఉన్న బావమరిదిని.. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్యను తుదముట్టించాలని భావించాడు. బుధవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ తన రివాల్వర్‌ని క్లీన్‌చేసి భద్రపర్చమని ప్రసాద్‌కు చెప్పాడు. కానీ ప్రసాద్ ఆ రివాల్వర్‌ను భద్రపరిచి ఆ తరువాత ఎవరికీ తెలియకుండా తీసుకున్నాడు. అనంతరం గుండ్లసింగారం వచ్చాడు.
గురువారం ఉదయం స్టేషన్‌కు వచ్చిన స్టేషన్‌హౌస్ ఆఫీసర్ రివాల్వర్ తీసుకునేందుకు వెళ్లగా కనిపించలేదు. దీంతో స్టేషన్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించి రివాల్వర్‌ను ప్రసాద్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అతడికి పోలీసులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని సమాచారం.
కోటపల్లి నుంచి గురువారం ఉదయం గుండ్లసింగారం చేరుకున్న ప్రసాద్ నేరుగా అత్త కమలాదేవి ఇంటికి వెళ్లి ఆమెను కాల్చాడు. అప్పటికే స్థానికులు గుమిగూడడం, కుటుంబ సభ్యులు రావడం.. అతనిపై దాడి చేయడంతో ముందుగా అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.
తూటా శబ్దంతో కలకలం
కమలాదేవిపై రివాల్వర్‌తో ఒక రౌండ్ కాల్పులు జరపడంతో ఆమె ఇంటి గేటు నుంచి రోడ్డుమీదికి రక్తమోడుతూ వచ్చి కింద పడింది. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారు. కొద్దిదూరంలో ఉన్న ప్రసాద్ భార్య రమాదేవితోపాటు ఆమె కూతుళ్లు, సోదరుడు హుటాహుటిన వచ్చి చూసేసరికి తల్లి చనిపోయి కనిపించడంతో బోరున విలపించారు.
ఓ వైపు తల్లి మృతదేహం.. మరో వైపు ప్రసాద్ దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండడంతో ఆగ్రహానికి గురయ్యారు. అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతని తల, శరీరంపై తీవ్రగాయాలై రక్తంతో తడిసిపోయాడు.
ఆధారాల సేకరణ..
సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు ఘటనస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఇరుగుపొరుగు వారిని, కమలాదేవి కూతురు రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. రక్తనమూనాలు సేకరించారు. కాల్చిన బుల్లెట్ షెల్ కోసం దాదాపు గంటరన్నపాటు వెతికినా లభ్యం కాలేదు.
కొంతకాలంగా వేర్వేరుగా..
ప్రసాద్, రమాదేవిలు కుటుంబ కలహాలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం తనను వేధింపులకు గురి చేస్తున్నాడని రమాదేవి నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాన్ని ప్రసాద్ అవమానకరకంగా భావించినట్లు చర్చ జరుగుతోంది. దీనంతటికి భార్యతోపాటు అత్త, బావమరిది కారణమని కోపం పెంచుకున్న అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
సమగ్ర దర్యాప్తు – ఎంఏ బారి, డీసీపీ
హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక, ఇతరత్రా కారణాలు ఉన్నాయనే అంశంపై విచారణ చేపడతామన్నారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మృతురాలి కూతురు రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మిస్సింగ్పై విచారణ
కోటపల్లి పోలీసుస్టేషన్‌లో గన్ మిస్సింగ్‌పై రామగుండం కమిషనరేట్ పోలీసులు గురువారం విచారణ చేపట్టారు. మంచిర్యాల డీసీపీ సుధీర్‌రాంనాథ్ కేకన్ స్టేషన్‌కు చేరుకుని సుమారు ఆరు గంటలపాటు విచారణ జరిపారు. నిందితుడు ఉపయోగించింది సర్వీస్ గన్ కావడంతో పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆయుధం అతడి చేతికెలా వచ్చింది..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ప్రసాద్ షార్ట్ వెపన్ తీసుకెళ్లడంపై సమగ్ర విచారణ చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించిన డీసీపీ పలువురి వాంగ్మూలం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివాదాస్పదుడే..
ప్రసాద్ వైఖరి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో హోంగార్డుగా పని చేసిన ప్రసాద్ 2012–13 కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో పెద్దపల్లి జిల్లాలో పని చేశాడు. మద్యానికి బానిసై విధుల్లో నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులతో గొడవ పడేవాడని సమాచారం.
మూడు నెలల క్రితమే పెద్దపల్లి జిల్లా నుంచి మారుమూల ప్రాంతమైన కోటపల్లి పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యాడు. విధుల్లో చేరినప్పటి నుంచి ఎక్కువగా విధులకు డుమ్మా కొట్టడం, తోటి సిబ్బందితో అమర్యాదగా వ్యవహరించడంతో సిబ్బంది అతడికి దూరంగా ఉండేవారని తెలిసింది.
దొంగతనం కేసు
కానిస్టేబుల్ ప్రసాద్‌పై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.సురేష్‌కుమార్ తెలిపారు. స్టేషన్‌లోని ఆయుధ కారాగారంలో ఉంచిన పిస్టల్‌ను అపహరించుకుపోయాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment