జంక్షన్ల కుదింపు
● ప్రారంభమైన కూల్చివేత పనులు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాసగార్డెన్ వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జంక్షన్ల కుదింపు పనులను సోమవారం ప్రారంభించారు. ఐబీ చౌరస్తాలోని జంక్షన్‌ను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఆరులేన్ల రోడ్డుకు సరిపోయేలా జంక్షన్‌ను కుదించనున్నారు. రూ.4 కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసి నిర్మించిన జంక్షన్లు పెద్దగా ఉండడంతో వాటిని కుదిస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు కక్షకట్టి కూల్చివేస్తున్నారని, ఇలాంటి ధోరణిని వీడాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఐబీ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీ టాకీస్ చౌరస్తా వరకు రూ.4 కోట్లతో నాలుగు జంక్షన్లు నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే రోడ్లు విస్తరణ పేరిట వాటిని కుదించడం సరికాదన్నారు. రోడ్డు విస్తరణ కోసం గత ప్రభుత్వమే రూ.35 కోట్లను మంజూరు చేసిందన్నారు. రోడ్డు విస్తరణతో జంక్షన్లు ఎలాంటి ఆటంకం కాదని తెలిపారు. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే కూల్చివేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా, కొద్దిసేపు పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి, ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనలో బీఆర్‌ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, గాదె సత్యం, అంకం నరేశ్, శ్రీపతి వాసు, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, అత్తి సరోజ, మందపల్లి శ్రీనివాస్, మొగిలి శ్రీనివాస్, అన్నపూర్ణ, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment