గిన్నిస్ రికార్డులో స్థానం జిల్లాకే గర్వకారణం
ఆసిఫాబాద్: ఆదివాసీ గిరిజనుల సంప్రదాయమైన గుస్సాడీ నృత్య ప్రదర్శన గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకోవడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గిరి జన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిర్యాణి మండలం దంతన్‌పల్లి గ్రామానికి చెందిన భీమయ్య కొలాం గుస్సాడీ బృందంతో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, గిరిజన సంఘాల నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఢిల్లీలో 5 వేల మంది కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో దంతన్‌పల్లి పీవీటీజీ కొలాం గుస్సాడీ బృందం నృత్య ప్రదర్శన రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించిందన్నారు. గిరిజనుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. అనంతరం గుస్సాడీ బృంద సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు, ఆత్రం గంగారాం, మడావి భీమ్‌రావు, కుర్సింగ మోతీరాం, ఆత్రం సంతోశ్, చహకటి దసరు, తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
గిన్నిస్ రికార్డులో స్థానం జిల్లాకే గర్వకారణం
Comments
Please login to add a commentAdd a comment