కొలిక్కి రాని హమాలీల వివాదం
● రెండో రోజు జైనథ్‌లో జరగని శనగ కొనుగోళ్లు
ఆదిలాబాద్‌టౌన్: జైనథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో హమాలీల వివాదం ఎటూ తేలలేదు. రెండోరోజు మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్లు జరగలేదు. బుధవారం సైతం ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. ఇద్దరు గుత్తేదారుల మధ్య నెలకొన్న లొల్లి రైతుల పాలిట శాపంగా మారింది. ఆందోళనను సద్దుమణిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని జైనథ్ మార్కెట్‌యార్డుకు పంపించింది. సదరు అధికారులు దీనిపై ఎటూ తేల్చకుండానే వెనుదిరిగారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు ఎవరికి ఎమి చెప్పే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమి లేక ఉన్నాతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని అక్కడి నుంచి వెనుదిరిగారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ ఏడీ గజానంద్, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్ రెడ్డి, డీసీవో మోహన్‌లు మార్కెట్ కార్యదర్శి దేవన్నకు సూచించారు. అక్కడున్న కాంటాల్లో ఇద్దరు గుత్తేదారులకు చెరిసగం చూసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే సదరు గుత్తేదార్లు దీనిపై అంగీకరించేందుకు ముందుకు రాలేదు. జైనథ్ వ్యవసాయ మార్కెట్ అధికారులు కొత్త గుత్తేదారుకు లైసెన్స్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆయనకే హమాలీల బాధ్యతలను పూర్తిస్థాయిలో కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత 15ఏళ్లుగా బిహార్‌కు చెందిన గుత్తేదారే హమాలీలను సరఫరా చేస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా ఉన్నఫలంగా తనను ఏ విధంగా తొలగిస్తారని వాపోతున్నారు. ఇద్దరు గుత్తేదార్లను పిలిచి నచ్చజెప్పినప్పటికి వారి మధ్య సయోధ్య కుదరలేదు. శనగ పంటను విక్రయించేందుకు తీసుకొచ్చిన రైతులు కొనుగోళ్లు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీ కాంట్రాక్టర్ల లొల్లి కారణంగా తమను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నాతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రైతులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment