
రైతు ఆత్మహత్యలపై త్రిసభ్య కమిటీ విచారణ
తలమడుగు: మండలంలోని సుంకిడి, ఝరి గ్రామాల్లో ఇటీవల అప్పుల బాధతో ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు మంగళవారం గ్రామాల్లో విచారణ చేపట్టారు. కమిటీ సభ్యులైన ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి ఏడీ రాంకిషన్, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎస్సై అంజమ్మ, వ్యవసాయ అధికారి ప్రమోద్‌రెడ్డి ఝరి గ్రామానికి చెందిన రైతు గడం పోతారెడ్డి కుటుంబ సభ్యులను విచారించారు. రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? కౌలుకు ఎన్ని ఎకరాలు తీసుకున్నాడు? పెట్టుబడి సాయం ఏబ్యాంకులో తీసుకున్నాడు? ప్రైవేట్ అప్పులు ఎంత తీసుకున్నారు? అని వివరాలు సేకరించారు. అనంతరం సుంకిడి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి లింగన్న ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. రైతు వ్యవసాయ వివరాలు, పట్టా పాసు బుక్‌లను, బ్యాంక్ ఖాతాలు, అప్పులు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుంకిడి మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.