
తొడసం కట్టికి ఘన నివాళి
ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన సభకు సారధ్యం వహించిన తుమ్మగూడకు చెందిన తొడసం కట్టి స్మారక జెండా వద్ద ఆదివారం ఉదయం గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు తుమ్మగూడ నుంచి సంప్రదాయ వాయిద్యాలతో రాంనగర్‌చౌక్ వద్ద ఉన్న స్మారక జెండావద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తొడసం కట్టి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మగూడ గ్రామ పెద్దలు కనక హనుమంత్‌రావ్, సోయం వినోద్, ఆత్రం జల్పత్‌రావ్, మడావి శేకు, తదితరులు పాల్గొన్నారు.
ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
భైంసాటౌన్: పట్టణంలోని సాత్‌పూల్ వంతెన వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ముధోల్ వైపు నుంచి ప్యాసింజర్లతో వస్తున్న ఆటో భైంసాలోని సాత్‌పూల్ వంతెన వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో ఆటో బోల్తా పడగా, అందులోని ప్రయాణికులు నిజామాబాద్‌కు చెందిన సుశ్మిత, సతీష్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కల్లూరుకు చెందిన మరో ఇద్దరు మహిళలు, చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతోక్షతగాత్రులను ఏరియాస్పత్రికి
తరలించారు.