
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఉట్నూర్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సాలెవాడ(కె) గ్రామానికి చెందిన కోవ ప్రకాశ్ (47), కనక దత్తు ఆదివారం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌కు వెళ్తుండగా ఇంద్రవెల్లి నుండి ఉట్నూర్ వైపు వెళ్తున్న బైక్ పులిమడుగు సమీపంలో మూల మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోవ ప్రకాశ్‌కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108 ద్వారా ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గుర్తు తెలియని మహిళ..
భైంసారూరల్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారిపై తిమ్మాపూర్ గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. జాతీయ రహదారిపై గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మహిళకు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని, చేతిపై నేతాజీ అని పచ్చబొట్టు రాసి ఉందని, ఎరుపురంగు చీర ధరించి ఉందన్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే భైంసారూరల్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
వాంకిడి: మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన చెంద్రి లచ్చుంబాయి చిన్న కుమారుడు చెంద్రి సంతోష్(35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. శనివారం తల్లితో పాటు అతని భార్య కల్పన మందలించారు. దీంతో మనస్తాపానికి గురై రాత్రి అందరు పడుకున్న సమయంలో చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మృతుని తల్లి లచ్చుంబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): భోరజ్ మండలం పెన్‌గంగ సమీపంలోని డొల్లార గ్రామ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. మృతుని వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఛాతి భాగంలో కత్తితో పొడవడంతో శరీరంలోని పేగులు బయటకు వచ్చాయన్నారు. ముఖంపై కత్తితో పొడిచి గాయపర్చారన్నారు. ముఖం గుర్తుపట్టకుండా బండ రాయితో కొట్టినట్లు ఉందన్నారు. మృతుడు నలుపు రంగు టీషర్ట్, జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, మహారాష్ట్రవాసిగా అనుమానిస్తున్నామన్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉండవచ్చని ఎస్సై వివరించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే జైనథ్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
దరఖాస్తుల స్వీకరణ
నిర్మల్‌రూరల్: రాబోయే విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ డేనియల్ తెలిపారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో బెల్లంపల్లిలో 80 సీట్లు (బాలురు), నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో (బాలికలు) 80 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మే 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.