
భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
● కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్/జైపూర్: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి 2025 ఆర్వోఆర్ చట్టం అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో, జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన అవగాహ న సదస్సుల్లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవో శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. నూతన ఆర్‌వోఆర్ చట్టం ద్వారా పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేందుకు భూముల వివరాలను పూర్తిస్థాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూములను విరాసత్ చేసే ముందు సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. జూన్ 2 నాటికి ఎంపిక చేసిన మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించి మిగిలిన మండలాల్లో ఆగస్టు 15 వరకు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అనంతరం షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెన్నూర్‌లోని 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఇంది రా మహిళ శక్తి పథకంలో భాగంగా మండల సమాఖ్య అధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించారు.