Telangana Crime News: చేతులు తడిపితే తప్ప.. కాగితం గడప దాటదు! తాజాగా ఆరోగ్యశాఖలో..
Sakshi News home page

చేతులు తడిపితే తప్ప.. కాగితం గడప దాటదు! తాజాగా ఆరోగ్యశాఖలో..

Published Sat, Sep 23 2023 6:16 AM | Last Updated on Sat, Sep 23 2023 7:26 AM

- - Sakshi

మెదక్‌: ప్రభుత్వ శాఖల్లో అవినీతి వేళ్లూనుకుంది. చేతులు తడిపితే తప్ప కాగితం కార్యాలయం గడప దాటడం లేదు. అవసరం కోసం ప్రభుత్వ ఆఫీస్‌కు వెళితే అధికారులు అడిగినంత ఇచ్చుకోలేక, అటు సమయానికి పనులు కాక సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పని చేసేందుకు లంచం డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారుల వేధింపులతో విసుగు చెందిన బాధితులు తప్పని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో జిల్లాలో ఆరుగురు అవినీతి అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి.

జిల్లా వ్యాప్తంగా..
2019 సెప్టెంబర్‌ 19న నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో భూమికి సంబంధించిన ఎన్‌ఓసీ జారీ చేసేందుకు అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్‌ లంచం డిమాండ్‌ చేశారు. బాధితుడు కొంత సొమ్ము ముట్టజెప్పినా పని చేయకుండా వేధించాడు. దీంతో ఏసీబీకి సమాచారం ఇవ్వగా.. అధికారులు పక్కా ప్లాన్‌తో అడిషనల్‌ కలెక్టర్‌ ఇంట్లో, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

ఆయనతో పాటు నర్సాపూర్‌ ఆర్డీఓ అరుణారెడ్డి, చిలప్‌చెడ్‌ తహసీల్దార్‌ సత్తార్‌ను అరెస్టు చేశారు. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన రైతు నీరుడి పోచయ్య భూమి రిజిస్ట్రేషన్‌ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. ధరణి ఆపరేటర్‌ వేణు రూ.20 వేల లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

ఇదే ఏడాది ఫిబ్రవరిలో చిన్నశంకరంపేట తహసీల్దార్‌ కార్యాలయ ఆర్‌ఐ శ్రీహరి, వీఆర్‌ఏ సురేష్‌ బాబులు సంగాయిపల్లికి చెందిన శ్రీనివాస్‌ భూమిని కొత్త పాస్‌బుక్‌లో నమోదు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌ భూమికి సమీపంలోనే ఆర్‌ఐ శ్రీహరి భూమి ఉండడంతో డబ్బుల బదులు స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితుడు స్థలం ఇచ్చినా ఆర్‌ఐ పాస్‌బుక్‌లో నమోదు చేయకపోవడంతో ఏసీబీని ఆశ్రయించాడు. విచారణ చేసిన ఏసీబీ అధికారులు ఆర్‌ఐ, వీఆర్‌ఏల అవినీతి చిట్టాపై కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

2022 నవంబర్‌లో మెదక్‌లో ల్యాండ్‌ రికార్డర్‌ సర్వే ఏడీ గంగయ్య నర్సాపూర్‌ మండలం మాడెపు గ్రామానికి చెందిన రైతు మల్లేశం భూమిని కొలిచేందుకు రూ.30 వేలు అడిగాడు. డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. చేగుంట మక్కరాజ్‌పేటకు చెందిన రైతు నర్సింహరెడ్డి భూమి కొలత కోసం డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ను సంప్రదించాడు. ఆయన రూ.5 లక్షలు డిమాండ్‌ చేయగా, రూ.2.70 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

2019లో శివ్వంపేట మండలం ప్రాథమిక వైద్యారోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు రావాల్సిన బెన్‌ఫిట్స్‌పై కుటుంబసభ్యులు ఆ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ షౌకత్‌అలీని కోరగా, రూ.20 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా రూ.15 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇటీవల నర్సాపూర్‌కు చెందిన సతీష్‌ ఫిజియో థెరపీ క్లీనిక్‌ ఏర్పాటుకు అనుమతుల దరఖాస్తు చేసుకోగా, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌కు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ నెల 21న బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలో వరుసగా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతూ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement