సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టిక్కెట్టు దక్కని నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో అధినేత కేసీఆర్ చర్చించేందుకు సుముఖంగా లేరా..? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మదన్‌రెడ్డితో మాట్లాడుతుండటమే ఇందుకు కారణమా..? అవుననే అంటున్నాయని రాజకీయ వర్గాలు.
సీఎం కేసీఆర్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బరిలో ఉంటానని మదన్‌రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆయనతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆయన పట్టు వీడటం లేదు. సీఎంతో ఉన్న సన్నిహితంతో కాస్త వెనక్కి తగ్గే యోచనలో ఉన్నప్పటికీ, ఆయన అనుచరులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.
దీంతో నర్సాపూర్ అభ్యర్థిత్వంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా, ఈనెల 15వ తేదీన బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ ప్రక్రియకు ఇంకా ఒక రోజే గడువుంది. అయినప్పటికీ మదన్‌రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రాకపోవడంతో ఆయన ఎటూ తేల్చు కోలేకపోతున్నారు.
పెండింగ్‌లో కాంగ్రెస్ టిక్కెట్?
ఆర్‌ఎస్ అభ్యర్థిత్వం విషయంలో సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ టిక్కెట్టు ప్రకటన విషయంలో వేచి చూసే ధోరణిలో ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంకా ఏ నియోజకవర్గానికి అభ్యర్థిత్వాలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, చాలా చోట్ల అభ్యర్థులకు పరోక్షంగా టిక్కెట్లపై సంకేతాలిచ్చింది. నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని, ప్రజలను కలిసి మద్దతు కూడగట్టాలని అనధికారికంగా అభ్యర్థులకు ఆదేశాలిచ్చింది.
ఈ సంకేతాలున్న ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ, నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఈ సంకేతాలు ఎవరికీ లేవనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. దీంతో మదన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందనే చర్చ స్థానికంగా జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, గట్టి క్యాడర్ ఉన్న మదన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా సునీతా లక్ష్మారెడ్డిపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఎటూ తేల్చుకోలేకపోతున్న క్యాడర్
నర్సాపూర్ అభ్యర్థిత్వం ఎటూ తేలకపోవడంతో బీఆర్‌ఎస్ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. జనగామ టిక్కెట్టు విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన అధినాయకత్వం నర్సాపూర్ విషయంలో ఇంకా ఈదిశగా చర్యలు చేపట్టకపోవడంతో క్యాడర్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. మదన్‌రెడ్డితో ఉండాలా, సునీతారెడ్డి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. అయితే మదన్‌రెడ్డి అనుచరుల్లో కొందరు సునీతాలక్ష్మారెడ్డి వైపు క్రమంగా మొగ్గు చూపుతుండటం ఆసక్తిగా మారింది.
సునీతారెడ్డికి పరోక్షంగా సంకేతాలు..
నర్సాపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వంపై అధినేత నుంచి సంకేతాలు రావడంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి స్థానిక ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఆమె గ్రామాల్లో పర్యటిస్తూ అందరినీ కలుసుకుంటున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. గురువారం కూడా చిలప్‌చెడ్, నర్సాపూర్ మండలాల్లో పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment