సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి వచ్చే ఓట్లు తమకు నష్టం చేస్తాయా? మేలు చేస్తాయా? వారు బరిలో ఉంటే తమకు పడాల్సిన ఓట్లు చీలిపోతాయా? లేదంటే వ్యతిరేకత ఓటు చీలి పోయి మేలు జరుగుతుందా? ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు లోతైన విశ్లేషణల్లో నిమగ్నమయ్యారు. తమ గెలుపు కోసం పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళుతున్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశ విషయమై నిర్లక్ష్యం చేయడం లేదు.
నష్టం చేసే అవకాశాలున్న చోట్ల స్వతంత్రులతో నామినేషన్లు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లాభం చేకూర్చే అవకాశాలుంటే బరిలో ఉండాలని ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రస్తుతం పరిశీలన కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు గాను అన్ని చోట్ల స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు స్వతంత్రులు తమ సమస్యను ప్రజల దృష్టికి తెచ్చేందుకు, మరికొందరు ప్రతి ఎన్నికల్లో బరిలో ఉండాలని నామినేషన్లు వేస్తుంటారు. ఇలా ఈసారి కూడా కొందరు నామినేషన్లు వేశారు.
బ్యాలెట్ యూనిట్లు పెంచాల్సిన పరిస్థితి..
బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరిగితే బ్యాలెట్ యూనిట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణీత సంఖ్య లోపు అభ్యర్థులుంటే ఒక్క బ్యాలెట్ యూనిట్ సరిపెట్టొచ్చు. కానీ ఎక్కువ మంది ఉంటే బ్యాలెట్ యూనిట్లను పెంచాల్సి ఉంటుంది. దీంతో ఓటర్లు అభ్యర్థుల గుర్తులను వెతుక్కోవడంలో కొంత మేరకు అయోమయం నెలకొనే అవకాశం ఉంటుంది.
రేపటితో ముగియనున్న గడువు!
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమయం తక్కువగా ఉండటంతో వీలైనంత ఎక్కువ మంది స్వతంత్రులతో నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తే వీలైనంత ఎక్కువ మెజారిటీ సాధించవచ్చని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. ఉపసంహరణకు కేవలం ఒక రోజే గడువు ఉండటంతో అభ్యర్థులు.. స్వతంత్రులను కలిసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని..
గతంలో స్వతంత్ర అభ్యర్థుల కారణంగా కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం మారిపోయింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తును పోలిన గుర్తులు వీరికి కేటాయించడంతో తీవ్రంగా నష్టపోయారు. తమకు పడాల్సిన ఓట్లు వేలల్లో స్వతంత్రులకు పడ్డాయని వారు భావిస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనూ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవి చదవండి: తమ్మీ.. నువ్వు జర తప్పుకోరాదె! నీకేం కావాలో చెప్పు ఇస్తా!!
Comments
Please login to add a commentAdd a comment