దుబ్బాకటౌన్: సీఎం కేసీఆర్‌కు వైన్స్ టెండర్లపై ఉన్న ప్రేమ కొలువుల నోటిఫికేషన్లపై ఎందుకు లేదని.. ఇంతటి దుర్మార్గమైన బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం దుబ్బాకలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారు బీజేపీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని భూంపల్లి–అక్భర్‌పేట, రాయపోల్ మండలాల్లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబపాలనకు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడటం ఖాయమైందన్నారు. రాష్ట్రంలో ఏం మిగులకుండా దోచుకుతిన్నారని ఆరోపించారు. ఇప్పటికే తాగుబోతుల రాష్ట్రంగా మర్చారని, మళ్లీ గెలిస్తే పేదల భూములు సైతం ఏం మిగుల్చరన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడ వేయలేదని, పెట్టిన పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించకుండా పేపర్లు లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క శాతం ఉన్న సీఎం కులానికి ఐదు మంత్రి పదవులా..?
కేసీఆర్ కేబినెట్‌లో కేవలం ఒక్క శాతం ఉన్న తన కులానికి ఐదు మంత్రి పదవులు ఇచ్చి.. 23 శాతం ఉన్న ఎస్సీలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చాడని.. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు బీఆర్‌ఎస్ కార్యకర్తలకే పంపిణీ చేసుకున్నారని ఆరోపించారు. ప్రజల బాగు కోసమే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ తో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది
మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. 2020 ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో సహా మొత్తం కేబినెట్, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులందరూ కలిసి నన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారని.. కానీ చైతన్యవంతమైన దుబ్బాక గడ్డ మీద పుట్టిన ప్రజలు నన్ను గెలిపించి తమ పౌరుషాన్ని చూపారన్నారు. మూడేళ్లు తనకు అధికారం ఇస్తే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు తెచ్చానని తెలిపారు. రాష్ట్ర ఖజానా అంతా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకే ఖర్చుపెట్టి మిగతా నియోజకవర్గాలకు చాలా అన్యాయం చేశారన్నారు.
హరీశ్‌ను దుబ్బాక ప్రజలు నమ్మరు
హరీశ్‌రావును దుబ్బాక ప్రజలు నమ్మరని.. ట్రబుల్ షూటర్ అని గొప్పలు చెప్పుకునే ఆయనకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని.. మళ్లీ ఓటమి రుచి చూపుతామని రఘునందన్‌రావు అన్నారు. ఉన్న నిధులన్నీ సిద్దిపేటకే తీసుకుపోయి దుబ్బాక నియోజకవర్గానికి తీరని అన్యాయం చేస్తుంది హరీశ్‌రావే అన్నారు. నన్ను ఓడగొట్టేందుకు ఆయన చేస్తున్న కుట్రలు చాలా ఉన్నాయని, ఎన్ని చేసినా ప్రజల మద్దతుతో తిప్పిగొట్టి భారీ మెజార్టీతో గెలుపొందుతానన్నారు.
ఎంపీగా ఉండి దుబ్బాకకు ఏం చేసిండు
రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిండో ప్రజలు గమనించాలని రఘునందన్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి జరిగితే తామే చేశామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభాకర్‌రెడ్డికి ఓట్లేస్తే పరాయి పెత్తనం సాగుతుందని, దుబ్బాక కోసం బరిగీసి కొట్లాడే నన్ను గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.
ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా..
దుబ్బాకరూరల్: ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం భూంపల్లి–అక్భర్‌పేట మండలంలోని చౌదర్‌పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయడం చూస్తేనే బీఆర్‌ఎస్ వైఖరి స్పష్టం అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలన్నారు.
రాయపోల్ మండలంలో..| రాయపోల్‌ః తన స్వగ్రామం బోప్పాపూర్, రాయపోల్ మండలం టెంకంపేట, బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో మహిళలు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరీశ్ దుబ్బాకపై పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులన్నీ సిద్దిపేటకే తరలించుకుపోయి తీరని అన్యాయం చేశాడన్నారు.
పొలంపల్లిలో ఇంటింటి ప్రచారం
చేగుంట(తూప్రాన్): మండలంలోని పొలంపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు రఘునందన్‌రావును గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, వరి క్వింటాలుకు రూ.3100 మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా మాభూమి పోర్టల్ వస్తుందని ప్రచారంలో వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, వేణు, శ్రీకాంత్, రమశ్, ఎల్లం, గణేష్, భూపాల్, కుమ్మరి నర్సింలు, బాలకృష్ణ, స్వామి పాల్గొన్నారు. అనంతరం చేగుంట, మాసాయిపేట మండలాలకు చెందిన 200మంది కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీలో చేరారు.
ఏరులై పారుతున్న మద్యం
మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ పాలనలో వేసిన శిలాఫలకాలకే దిక్కుమొక్కు లేదని రఘునందన్‌రావు విమర్శించారు. అక్బర్‌పేట–భూంపల్లి మండలం రుద్రారంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మద్యం ఏరులై పారితే తప్ప పాలన ముందుకు సాగని పరిస్థితి నెలకొందన్నారు. దుబ్బాకలో ఎక్కడ కూడా దళిత బంధు అమలు కాని పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న బీఆర్‌ఎస్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లన్నగారి శాంతవ్వ, భిక్షపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment