గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రచార పర్వం కీలక దశకు చేరుకున్నది. పోలింగ్ సమీపిస్తుండటంతో అన్ని వర్గాలను ఆకర్షించడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్‌ఎస్ దూకుడుగా ముందుకువెళ్తోంది. బీజేపీ, కాంగ్రెస్ సైతం ఓటర్లను ఆకర్శిస్తూనే అన్ని వర్గాలను తమవైపు తిప్పుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
గజ్వేల్: నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్‌కు భారీ మెజారిటీని అందించడానికి బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రయ త్నిస్తున్నాయి. కేసీఆర్ రాష్ట్రమంతటా పర్యటిస్తున్న క్రమంలో ఆయన గెలుపు బాధ్యతను నియోజకవర్గంలోని పార్టీ యంత్రాంగం భుజస్కందాలపై వేసుకున్నది. ఎలాగైనా కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించడానికి శ్రేణులు పనిచేస్తున్నాయి. పని విభజన చేసుకుంటూ నేతలు ముందుకు సాగుతున్నారు. ఈ నియోజకవర్గానికి మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎఫ్‌డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతోపాటు ఇతర ముఖ్య నేతలు సైతం నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి, మర్కూక్, ములుగు, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తోంది.
ఇప్పటికే సుమారుగా 40వర్గాలతో అధికార పార్టీ నేతలు సమ్మేళనాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే భూనిర్వాసితులు, దివ్యాంగులు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు, వైశ్యులు, కెమిస్ట్, డ్రగ్గిస్ట్ తదితర సమ్మేళనాలకు మంత్రి హరీశ్‌రావు హజరై వారి మద్దతును కోరారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం తర్వాత గజ్వేల్‌లో వచ్చిన మార్పును వివరిస్తూ... ఈ అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా కొసాగాలంటే కేసీఆర్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మరికొన్ని ముఖ్యమైన వర్గాల ఆత్మీయ సమ్మేళనాలను సైతం నిర్వహించడానికి అధికార పార్టీ సిద్ధమవుతోంది.
ఈటల సైతం..
బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇక్కడ వివిధ వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ద్వితీయశ్రేణి నాయకులను తనవైపు తిప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో బలంగా ఉన్న వర్గాలను గుర్తించి ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వర్గాలను కలిశారు. గతంలో టీఆర్‌ఎస్‌లో క్రీయాశీలకంగా ఉండి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న నేతలను కలిసి వారి మద్దతును కోరుతున్నారు. అంతేకాకుండా బీసీ నినాదాన్ని ప్రచారంలో బలంగా వాడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ నేతలు చూపుతున్న నిర్లక్ష్యాన్ని తనదైన శైలిలో ఎండ గడుతున్నారు.
స్థానిక నినాదాన్ని నమ్ముకుని..
కాంగ్రెస్ అభ్యర్థి, తూంకుంట నర్సారెడ్డి మాత్రం స్థానిక నినాదాన్ని నమ్ముకొని ఎన్నికల రంగంలోకి దిగారు. తన ప్రచారంలో ప్రతి చోట ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పార్టీల ప్రయత్నాలు నడుమ గజ్వేల్ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment