రెండు రోజుల్లో జాతర.. నిధులేవీ..? | - | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో జాతర.. నిధులేవీ..?

Published Mon, Feb 24 2025 9:27 AM | Last Updated on Mon, Feb 24 2025 9:27 AM

రెండు రోజుల్లో జాతర.. నిధులేవీ..?

రెండు రోజుల్లో జాతర.. నిధులేవీ..?

ఏడుపాయల జాతరపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నీడలు కమ్ముకున్నాయి. ఈనెల 26వ తేదీ నుంచి జరిగే మహా జాతరలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కరువైంది. నోటిఫికేషన్‌ విడుదలైనా.. ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయక పోవడంతో జాతర నిర్వహణ భారమంతా అధికారులపైనే పడింది. ఇన్‌చార్జి ఈవో అరకొర సిబ్బందితో ఇబ్బంది పడుతున్న వేళ.. ఈ మహా జాతర నిర్వహణ సవాల్‌గా మారింది. మరో రెండు రోజుల్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు జాతర ఏర్పాట్ల కోసం నిధులు విడుదల కాలేదు.

పాపన్నపేట(మెదక్‌): తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల జాతర ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ప్రతియేటా సుమారు 15 లక్షల వరకు భక్తులు హాజరవుతారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వల్ల ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కరువైంది. ఇప్పటి వరకు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌. అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ ఆధ్వర్యంలో రెండు సార్లు సన్నాహక సమావేశం నిర్వహించారు. చివరగా 25న ఏడుపాయల్లో మరో సమావేశం నిర్వహించనున్నారు. పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకపోవడంతో ,స్థానిక సమస్యలు ,పరిష్కార మార్గాలు, సూచనలు కరువయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి .తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతి యేటా ఏడుపాయల జాతర ఏర్పాట్లకు రూ.2 కోట్లు విడుదల చేస్తున్నారు. ఈసారి ఇంత వరకు నిధులు విడుదల కాలేదు. అయినా ఎప్పటిలాగే పనులు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఏటా మహాశివరాత్రి రోజున ప్రభుత్వం తరపున మంత్రి, లేదా ఎమ్మెల్యే దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ప్రారంభిస్తారు. అయితే ఈసారి ఎవరు పట్టు వస్త్రాలు సమర్పిస్తారో ఇంత వరకు ఖరారు కాలేదు.

ఇన్‌చార్జి ఈవో, అరకొర సిబ్బంది

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల 6ఏ టెంపుల్‌గా గుర్తింపు పొందింది. రూ.10 కోట్లకు పైగా ఆదాయం ఉండటంతో డిప్యూటీ కమిషనర్‌ స్థాయి ఈవో ఇక్కడ ఉండాలి. కనీసం రెగ్యులర్‌ ఈవో కూడా లేరు. ఆగస్టులో ఉమ్మడి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో ఇక్కడ 9 మంది జూనియర్‌ అసిస్టెంట్‌లు ఉండే వారు. ప్రస్తుతం నలుగురు మాత్రమే పని చేస్తున్నారు. జాతర కోసం కొంత మంది సిబ్బందిని డిప్యూటేషన్‌పై పంపాల్సిందిగా కమిషనర్‌ కార్యాలయానికి ఈవో విజ్ఞప్తి చేయగా.. కొండగట్టు దేవస్థానంలో పనిచేసి జనవరిలో రిటైరైన వై.అంజయ్యను రెండేళ్ల కోసం, తాత్కాలిక ప్రాతిపదికన ఏడుపాయల్లో అసిస్టెంట్‌ ఈవోగా నియామకం చేస్తూ అడిషనల్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అతని నియామకం వివాదాస్పదం కావడంతో, విధుల్లో చేరకుండానే నిలిచి పోయినట్లు తెలిసింది.

పేరుకు పోయిన ప్లాస్టిక్‌ చెత్తా చెదారం

ప్రారంభమైన ఏర్పాట్లు

ఏడుపాయల జాతర కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మంజీరా నది చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్‌ ప్రదేశాలు, తాత్కాలిక టాయిలెట్లు, ఆలయం ముందు క్యూలైన్లు నిర్మిస్తు్‌ాన్నరు. ఆదివారం సాయంత్రం ఏడుపాయలకు సింగూరు నుంచి 0.35 టీఎంసీ నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. అయితే ఏడుపాయల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌, చెత్తా చెదారం పేరుకుపోయింది. దాన్ని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది.

‘ఏడుపాయల’పై ఎన్నికల కోడ్‌ నీడలు

ఏర్పాట్లు అంతంతమాత్రమే

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేదెవరు.?

అధికారులకు సవాల్‌గా మారిన నిర్వహణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement