
ఎమర్జెన్సీ భవనం... పనులేమో నత్తనడక
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలోని పిల్లికోటాల్‌లోని మాతాశిశు ఆస్పత్రి (ఎంసీహెచ్) పక్కనే నిర్మిస్తోన్న ప్రత్యేక అత్యవసర సేవల (ఎమర్జెన్సీ) ఆస్పత్రి భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సరైన పనుల పట్ల ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడం, నాణ్యతలేని పనులు, ఎక్కడా కానరాని అధికారుల పరిశీలనలతో ఈ భవన నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. గోడలు కట్టి కూల్చివేసి మరోసారి గోడలు కట్టడం వంటి చేష్టలతో ఎమర్జెన్సీ భవన నిర్మాణ పనులు అభాసుపాలవుతున్నాయి. ప్రారంభించి ఏడాదిన్నర కావొస్తున్నా కనీసం సగం నిర్మాణ పనులు కూడా పూర్తికాలేదంటే పనులు ఎంత నత్తనడకన సాగుతున్నాయో అవగతమవుతోంది.
తప్పనిసరి నిబంధనతో...
జిల్లాకు ఇప్పటికే వైద్య కళాశాల మంజూరు కావడంతో దానిని ప్రస్తుతం ఓ ప్రైవేటు భవనంలో కొనసాగిస్తున్నారు. అయితే ఆ కళాశాల పరిధిలో 500 పడకల ఆస్పత్రి తప్పనిసరిగా ఉండాలనే వైద్యవిధాన పరిషత్ నిబంధనతో ఎంసీహెచ్ పక్కనే రూ.23.75కోట్ల వ్యయంతో 100 పడకల ఎమర్జెన్సీ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని తలపెట్టారు. ఇప్పటికే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 120 పడకలు, ఎంసీహెచ్‌లో 100 పడకలున్న సంగతి తెలిసిందే. మరో 180 పడకల ఆస్పత్రి కోసం (మెడికల్) కళాశాల భవనంతోపాటు నర్సింగ్ కళాశాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకోసం స్థలాన్ని సైతం పరిశీలించారు. కానీ ఇది టెండర్ దశలో ఉంది.
పర్యవేక్షణ ఏది?
మెడికల్ ఇంజనీర్ పర్యవేక్షణలో ఎమర్జెన్సీ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని 2023 జూన్‌లో ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఈ పనులను పర్యవేక్షించిన పాపాన లేదు. సరైన ప్రణాళిక లేకపోవడంతో గోడలు కట్టి కొంత పూర్తయ్యక వాటిని కూల్చేస్తున్నారు. తిరిగి మళ్లీ అదే పద్ధతిలో గోడలు కడుతున్నారు. నాసిరకం ఇసుక, వాటర్ క్యూరింగ్ లేకపోవడంతో కట్టిన గోడలు ఎన్నేళ్లు మన్నిక ఉంటాయనే ఆందోళన లేకపోలేదు.
ప్రజాధనం వృథా..
ఎమర్జెన్సీ ఆస్పత్రి భవన నిర్మాణ పరిస్థితి రాజుల పైసా రాళ్లపాలు అన్న చందనా తయారైంది. కోట్లాది రూపాయలతో సాగుతున్న నిర్మాణపనుల్ని దగ్గరుండి పర్యవేక్షించాల్సి అధికారులు ఎక్కడా కానరావడంలేదు. నిర్మాణ పనులు ఆన్‌లైన్ టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను మాత్రం మరో సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పనుల్లో పూర్తిగా నాణ్యత లోపిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారమంతా అధికారుల కనుసనల్లోనే జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఈ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత, వేగం పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
రూ.23.75కోట్ల వ్యయంతో ఆస్పత్రి నూతన భవన నిర్మాణం
గోడలు కట్టి.. కూల్చి.. మళ్లీ కట్టి...
ఏడాదిన్నరగా ఇదే తంతు
పట్టించుకోని అధికారులు... పర్యవేక్షణ లోపం
Comments
Please login to add a commentAdd a comment