
అద్దె భవనాలే దిక్కు!
అల్లాదుర్గం(మెదక్): పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటివరకు సొంత భవనాలు నిర్మించలేదు. కనీసం స్థల పరిశీలన చేయలేదు. దీంతో అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే సరిపడా సిబ్బందిని సైతం నియమించలేదు. దీంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ఇది అల్లాదుర్గంలోని ప్రభుత్వ కార్యాలయాల దుస్థితి.
2016లో అప్పటి ప్రభుత్వం పునర్విభజనలో భాగంగా జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. ఇందులో సంగారెడ్డి జిల్లాలో ఉన్న అల్లాదుర్గం మండలాన్ని మెదక్ జిల్లాలో కలిపింది. అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాలను కలిపి అల్లాదుర్గం సబ్‌డివిజన్‌గా ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ సబ్ డివిజన్, పోలీస్ సర్కిల్ కార్యాలయం, ఇరిగేషన్ సబ్ డివిజన్, ఐసీడీఎస్ ప్రాజెక్టు, ఉద్యానవనం, పీఏసీఎస్ సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అయితే అరకొర వసతుల మధ్య అద్దె ఇంటిలో ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించేందుకు సరిపడా హాల్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమావేశం నిర్వహించేందుకు కల్యాణ మండపం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే మూడేళ్లుగా ఇన్‌చార్జిలతోనే అల్లాదుర్గం సీడీపీఓ కార్యాలయం కొనసాగుతుంది. పంచాయతీరాజ్ సబ్‌డిజన్ కార్యాలయం ఐకేపీ కార్యాలయంలో కొనసాగుతుంది. సొంత భవనం కోసం ఎవరు కృషి చేయడం లేదు. ఈ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయినా, ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. కార్యాలయంలో డీఈఈ, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉన్నారు. కార్యాలయ పరిధిలో నలుగురు ఏఈలకు ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయం ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహంలో చిన్న గదిలో కొనసాగుతుంది. ఈ కార్యాలయంలో అటెండర్, రికార్డు అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు లేరు. అల్లాదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయం, హౌసింగ్ శాఖ నిర్మించిన మోడల్ హౌస్‌లో కొనసాగుతుంది. ఇరుకై న రెండు గదులలో కార్యాల యం నిర్వహిస్తున్నారు. సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలతో కార్యాలయంలో సమా వేశాలు నిర్వహించేందుకు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా 2017 జనవరి 16న అల్లాదుర్గంలో ప్రాథమిక వ్యవసాయ సర్కిల్, ఉద్యానవన కార్యాలయాలను అప్పటి ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రారంభించారు. అప్పట్లో ఎంపీపీ కార్యాలయంలోని గదులలో కార్యాలయాలు కొనసాగించారు. రెండేళ్ల తర్వాత 161 జాతీయ రహదారి విస్తరణలో సగం కూల్చివేశారు. దీంతో ఈ కార్యాలయాలకు భవనాలు లేక ఎత్తివేశారు.
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు
అరకొర వసతుల మధ్య అధికారుల విధులు
పోస్టుల భర్తీలోనూ అలసత్వం
ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన కలెక్టర్
అల్లాదుర్గంలో బీసీ గురుకుల పాఠశాల, ఐటీఐ, ఐసీడీఎస్, ఫైర్‌స్టేషన్, పీఆర్ సబ్ డివిజన్ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 23న స్థలాలను పరిశీలించారు. అయితే స్థలాలు కేటాయించిన ప్రభుత్వం భవన నిర్మాణాలకు నిధులు ఎప్పుడు మంజూరు చేస్తుందో, అవి ఎప్పుడు పూర్తవుతాయో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment