విలీన గ్రామం.. ప్రగతికి దూరం
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శివారు గ్రామాల్లో కనీస వసతులు కరువై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 2018లో ఆవిర్భవించిన మున్సిపాలిటీలో గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాలతో పాటు రెండు తండాలను విలీనం చేశారు. మున్సిపాలిటీలో విలీనం అనంతరం నిబంధనల మేరకు పన్నులు పెరిగాయి. అయినా ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని రెండు గ్రామాల ప్రజలు వాపోయారు. రెండు గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు పాక్షికంగా ధ్వంసం కాగా, వాటి మరమ్మతు విషయమై ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈవిషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎంతమాత్రం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు, తండాల గిరిజనులకు ఉపాధి పనులు అత్యవసరం కాగా, మున్సిపాలిటీలో విలీనం అనంతరం ఈ పథకానికి నోచుకోకుండా పోయారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉపాధి పనులకు వెళ్లేవారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌ను వివరణ కోరగా.. మున్సిపాలిటీలో విలీనమైన గుల్పర్తి, కోమటిపల్లి, రెండు తండాల అబివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి చేపట్టామని, నిధుల మంజూరును బట్టి మరిన్ని పనులు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment