
ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు నిధులు
● నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ఇప్పటికే 25 ఎకరాలు కేటాయింపు
రామాయంపేట(మెదక్): ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఉత్వర్తులు అందాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ పాఠశాల భవన సముదాయం నిర్మాణానికి రామాయంపేట పట్టణ శివారులో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొదటి విడతలో 14 నియోజకవర్గాకు ఈ స్కూళ్లు మంజూరయ్యాయి. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు సామాజిక అంతరాలు లేని అన్నివర్గాలకు చెందిన 2,500 పైగా విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు.. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్కూల్ భవన నిర్మాణం జరపనున్నారు. ఈ స్కూల్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత బోధనతో పాటు వసతి కల్పించనున్నారు. హాస్టళ్లు, కంప్యూటర్ల గదులు, ఆడిటోరియం, అవుట్ డోర్, ఇండోర్ జిమ్, క్రీడా మైదానాలు, టెన్నీస్ కోర్టు, వంటశాల, గ్రంథాలయాలు, క్రీడలకు సంబంధించి వేర్వేరుగా భవనాలు నిర్మించనున్నట్లు సమాచారం. క్రీడలతో పాటు కళలకు ఈ స్కూల్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment