శివ్వంపేట(నర్సాపూర్): సీసీ రోడ్డు పనుల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మండల పరిధి లచ్చిరెడ్డిగూడెంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా రూ. 15 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి బుధవారం వచ్చారు. అయితే స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి లేకుండా ప్రొటోకాల్ విస్మరించి ఎలా పనులు ప్రారంభిస్తారని బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. జై రేవంత్‌రెడ్డి అంటూ కాంగ్రెస్ నాయకులు, జై కేసీఆర్ అంటూ బీఆర్‌ఎస్ నాయకులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రాజిరెడ్డి పనులు ప్రారంభించి మాట్లాడారు. పార్టీలకతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.