
మహిళల్లో అపారమైన శక్తి సంపద
మెదక్ మున్సిపాలిటీ: మహిళల్లో అపారమైన శక్తి సంపద ఉందని, అదే సమయంలో అప్రమత్తత అవసరమని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు మగ, ఆడపిల్లలను సమానంగా చూడాలని సూచించారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమన్నారు. మహిళా సాధికారతకు చదువు చాలా ముఖ్యం అన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. మగ పిల్లలకు మహిళలను గౌరవించే విధంగా విలువలు, క్రమశిక్షణ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందన్నారు. మహిళలు ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి