
‘పది’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
రేపటి నుంచి ప్రారంభం
● హాజరుకానున్న 10,388 మందివిద్యార్థులు ● ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్,సీరియల్ నంబర్ ● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
పాపన్నపేట(మెదక్): పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లాలో 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 5,020 బాలురు, 5,368 బాలికలు కలిపి మొత్తం 10,388 మంది హాజరుకానున్నారు. వీరికి అదనంగా వన్స్ ఫెయిల్ విద్యార్థులు 174 మంది పరీక్షలు రాయనున్నారు. ఈసారి మొదటిసారిగా ప్రశ్నాపత్రాలపై క్యూర్ కోడ్‌తో పాటు సీరియల్ నంబర్‌ను ముద్రిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించనున్నారు.
జిల్లాలో 68 పరీక్ష కేంద్రాలు
జిల్లాలో మొత్తం 225 ఉన్నత పాఠశాలలు, 10,388 విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఏ కేటగిరి 21, బీ 28, సీ కేటగిరిగా 19 కేంద్రాలుగా గుర్తించారు. పరీక్షల నిర్వహణ కోసం 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 68 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 500 మంది ఇన్విజిలేటర్లు, 19 మంది సిట్టింగ్ స్క్వాడ్, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పరీక్షక్షల నిర్వహణలో భాగం కానున్నారు. ఈసారి మొదటిసారిగా ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్ ముద్రిస్తారు. దీని ద్వారా ప్రశ్నాపత్రం బయటకు వెళ్తే, వెంటనే గుర్తించడానికి వీలుంటుంది. ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టికెట్ నంబర్ రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. మొదట ఓఎంఆర్ పత్రాలను సరిచూసుకొని ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతి విద్యార్థికి 24 పేజీల ఆన్సర్ బుక్ అంజేస్తారు. దానిపై హాల్‌టికెట్ నంబర్, పేరు రాయాల్సిన అవసరం లేదు.
పరీక్షలు రాస్తున్న విద్యార్థులు(ఫైల్)
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: రేపటి నుంచి జిల్లాలో ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని సూచించారు. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసిటన్లు వివరించారు. పోలీస్ అధికారులు పరీక్షల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తారని, పోలీస్‌స్టేషన్‌లో నుంచి పరీక్ష పత్రం కేంద్రానికి వెళ్లే సమయంలో కానిస్టేబుల్ తప్పనిసరిగా ఎస్కార్ట్ ఉండాలని ఆదేశించారు.
ఆత్మవిశ్వాసంతో రాయాలి
పరీక్ష హాల్‌కు ఉదయం 8.30 గంటల వరకు చేరుకోవాలి. ప్రశ్నాపత్రం ఇవ్వగానే ఆసాంతం చదవాలి. మొదట సులభంగా ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయాలి. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. విద్యుత్, ఫ్యాన్లు, తాగునీరు, వైద్యం, ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి.
– రాధాకిషన్, డీఈఓ

‘పది’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు