
సమయపాలన తప్పనిసరి
శివ్వంపేట(నర్సాపూర్)/నర్సాపూర్/పాపన్నపేట: ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే శాఖా పరమైన చర్యలు తప్పవని డీఈఓ రాధాకిషన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలువురు ఉపాధ్యాయలు సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్రార్థనలో పాల్గొనాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పలు పాఠశాలల్లో నూతనంగా ప్రారంభించిన ఏఐ బోధన చదువులో వెనుకబడిన విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. అనంతరం నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు, పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఆయన వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సర్కార్ బడులకు పంపాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
డీఈఓ రాధాకిషన్