మెదక్ కలెక్టరేట్: తమకు రాష్ట్ర బడ్జెట్‌లో ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆశా వర్కర్ల జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు రూ. 18 వేలు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అలాగే రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపచేయాలన్నారు. అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలని, పారితోషకం లేని పనులను చేయించకూడదన్నారు. అధికారుల వేధింపులు ఆపాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆశావర్కర్ల జిల్లా నాయకురాళ్లు రాణి, పెంటమ్మ, దుర్గ, గీత, లక్ష్మి, సీఐటీయూ జిల్లా నాయకులు సంతోష్ పాల్గొన్నారు.