నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

Published Fri, Mar 28 2025 6:17 AM | Last Updated on Fri, Mar 28 2025 6:15 AM

రామాయంపేట(మెదక్‌)/నిజాంపేట: ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగాలని గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం సూచించారు. మండలంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికై న దామరచెరువులో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. గృహాల నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామానికి 97 గృహాలు మంజూరు కాగా 20 గృహాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్‌, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం నిజాంపేట మండల పరిధిలోని పైలెట్‌ ప్రాజెక్టు గ్రామం నందగోకుల్‌లోనూ పర్యటించారు.

ఎంఈఓపై చర్యలు తీసుకోవాలి

మెదక్‌జోన్‌: అనుమతి లేకుండా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేసిన చిన్నశంకరంపేట ఎంఈఓ పుష్పవేణిపై చర్యలు తీసుకోవాలని తపస్‌, ఎస్టీయూ యూనియన్ల జిల్లా అధ్యక్షులు ఎల్లం, రాజ్‌గోపాల్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం డీఈఓ రాధాకిషన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంఈఓ చిన్నశంకరంపేట మండల పరిధిలోని మోడల్‌ స్కూల్‌తో పాటు మీర్జాపల్లి పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ల విధులకు ఆటకం కలిగించారని తెలిపారు. అలాగే విద్యార్థుల విలువైన పరీక్ష సమయాన్ని వృథా చేశారని వివరించారు. ఎంఈఓపై శాఖాపరమైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

మెదక్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాములు

మెదక్‌జోన్‌: మెదక్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది మర్కంటి రాములు ఘన విజయం సాధించారు. గురువారం జరిగిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో మొత్తం 90 మంది న్యాయవాదులు పాల్గొనగా, అందులో 87 ఓట్లు పోలయ్యాయి. మర్కంటి రాములుకు 49 ఓట్లు రాగా, షేక్‌ ఫజల్‌ అహ్మద్‌కు 37 ఓట్లు వచ్చాయి. నోటాకు ఒక ఓటు పడింది. రాములు 12 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా ప్రభాకర్‌ వ్యవహరించారు. ఈసందర్భంగా రాములును న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఆస్పత్రిని తనిఖీ చేసినట్లు తెలిపారు. సమర్థవంతంగా పనిచేసి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేఖ, డాక్టర్‌ రవి కుమార్‌ తదితర సిబ్బంది ఉన్నారు.

దరఖాస్తుల గడువు పెంపు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): స్కాలర్‌షిప్‌ దరఖాస్తుల గడువు పొడిగించారు. 2024– 25 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తుల గడువును మే 31 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి హమీద్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కార్యకర్తలకు అండగా ఉండాలి

నర్సాపూర్‌: కాంగ్రెస్‌ కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీ అధిష్టానం సూచించిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు పలువురు నాయకులు దిశానిర్దేశం చేశారు.

నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం   
1
1/3

నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం   
2
2/3

నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం   
3
3/3

నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement