డైరెక్టర్ పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్‌లో అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్‌లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డు దక్కించుకుంది.
ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి దివ్యప్రభ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో అను అనే నర్సు పాత్రలో దివ్య ప్రభ మెరిసింది. అయితే ఈ మూవీలో ఆమెకు సంబంధించిన న్యూడ్ సీన్స్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దివ్య ప్రభపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా లీకైన వీడియోలపై నటి దివ్య ప్రభ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని ఊహించానని తెలిపింది.
దివ్య ప్రభ మాట్లాడుతూ..'ఇది నిజంగా చాలా దారుణం. నేను ఆ పాత్ర కోసం సైన్ చేసినప్పుడు కూడా కేరళలోని ఓ వర్గం ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తుందని ముందే ఊహించా. ఒకవేళ ఆ పాత్రకు ఆస్కార్ వచ్చినప్పటికీ మలయాళీ మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదు. ఆ లీక్ అయిన వీడియోలను షేర్ చేసిన వారు మనదేశ జనాభాలో 10 శాతం మంది ఉన్నారు. కానీ వారి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నా. మలయాళీలు కూడా సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్‌లో ఉన్నారు. మా చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆమోదం లభించింది. అదే మాకు ముఖ్యం. ఒక నటిగా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్లో నా పాత్ర గురించి ముందే తెలుసు. కానీ కొంతమంది ఫేమ్ కోసమే చేశానని నన్ను విమర్శించారు. ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకున్నా. అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో నటించా. ఫేమ్ కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు' అని వివరించింది.
కాగా.. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment