మంచు ఫ్యామిలీలో గత రెండు రోజులుగా వివాదం నడుస్తోంది. తండ్రి కొడుకు.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు మోహన్ బాబు ఆస్పత్రిలో చేరడం వరకు వచ్చింది. మంగళవారం రాత్రి ఇంటి దగ్గరకొచ్చి మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడిచేయడం పెద్ద వివాదమైంది. ఈ క్రమంలోనే 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద ఈయనపై కేసు కూడా నమోదైంది. ఇదంతా పక్కనబెడితే రాత్రే మోహన్ బాబు ఆస్పత్రిలో కూడా చేరారు. ఇంతకీ ఈయన ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది? డాక్టర్స్ ఏం చెబుతున్నారు?
అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఏమైందా అని అందరూ అనుకున్నారు. వైద్యుల ఏం చెబుతున్నారంటే.. 'విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన స్థితిలో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఎడమ కంటి కింద గాయమైంది. బీపీ, రక్తపోటు కూడా పెరిగాయి. నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి' అని చెప్పారు.
(ఇదీ చదవండి: మా నాన్న దేవుడు: మంచు మనోజ్)
మోహన్ బాబుకి ప్రస్తుతం చికిత్స చేస్తున్న డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.
మరోవైపు తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్‌ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ వేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉండటంతో ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.
(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)
Comments
Please login to add a commentAdd a comment