
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురువారం మెట్రోరైలులో ప్రయాణించారు. సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణించిన పవన్ అక్కడ ఉన్న ద్రాక్షరామం రైతుతో ముచ్చటించారు. ఆయన మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. వకీల్‌సాబ్ షూటింగ్ నిమిత్తం ఆయన మియాపూర్ వెళ్లాల్సి వచ్చింది. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోస్టేషన్‌లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్‌లో ట్రైన్ మారారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్‌లో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. దీంతో ఆయన ద్రాక్షారామానికి చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది పవన్ కల్యాణ్ అభిమానులు ఉన్నారని చెప్పారు. ఈ ప్రయాణంలో పవన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇక ఈ మెట్రోప్రయాణంలో పవన్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment