బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లో ఉన్న జీఆర్ ఫాంహౌస్‌లో మే 19న రాత్రి జరిగిన ఒక రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు. అక్కడ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయిని పరప్పన అగ్రహార జైలుకు ఆమెను తరలించడం ఆపై బెయిల్ ద్వారా విడుదల కావడం జరిగింది. కానీ, తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఆమె పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదం వల్ల ఆమెను మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. తాజాగా హేమ ఒక సుదీర్ఘమైన లేఖను రాసి మంచు విష్ణుతో పాటు మా వ్యవస్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి పంపారు.
'సుమారు పదేళ్ల పాటు నేను మా సభ్యురాలిగా ఉన్నాను. చిత్రపరిశ్రమలో 'మా' ఒక అమ్మలా నన్ను రక్షిస్తుందని కోరుకుంటున్నాను. దాదాపు నెల రోజుల క్రితం ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నాను. అందులో నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. మీడియా దుష్ప్రచారం చేయడం వల్ల ఇదంతా జరిగింది. దీంతో నా కుటుంబసభ్యులకు తీవ్రమైన వేదన మిగిలింది. అనంతరం నన్ను మా సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ నిర్ణయం నాలో అంతులేని ఆవేదనను కలిగించింది. 'మా' బైలాస్ ప్రకారం నాకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. నా నుంచి వివరణ తీసుకోవాలి. నేను ఇచ్చిన వివరణలో లోపాలు ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి. నాపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కోర్టు కూడా నేను తప్పు చేసినట్లు ప్రకటించలేదు. మీడియా మాత్రమే నన్ను దోషిగా చూపించేందుకు ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలు నా వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని హాననం చేసింది.
నాకు సంబంధం లేని విషయాలను నాకు అంటగట్టి నన్ను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. మీడియా ఒత్తిడికి లోబడి నన్ను సస్పెండ్ చేయడం నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న ఈ సమయంలో నాకు మా అండగా ఉండాలి. నా సస్పెన్షన్ ను వెంటనే ఎత్తి వేస్తారు అని ఆశిస్తున్నాను.' అని హేమ ఒక లేఖ రాశారు. తనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా ఆమె జతచేశారు. ఈ లేఖ విషయంలో మా అధ్యక్షడు మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment