ఎవరేమన్నా పట్టించుకోను! | Actress Ileana talks about body dysmorphia | Sakshi
Sakshi News home page

ఎవరేమన్నా పట్టించుకోను!

Published Thu, Apr 29 2021 12:32 AM | Last Updated on Thu, Apr 29 2021 12:40 AM

Actress Ileana talks about body dysmorphia - Sakshi

సెలబ్రిటీలకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారికి నెటిజన్ల నుంచి ప్రశంసలు ఏ స్థాయిలో ఉంటాయో విమర్శలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిని హేళన చేస్తూ (బాడీ షేమింగ్‌) రకరకాల కామెంట్లు పోస్ట్‌ చేస్తుంటారు. ఈ పోస్టులు సదరు సెలబ్రిటీలను బాధకు గురిచేస్తుంటాయి. గోవా బ్యూటీ ఇలియానా కూడా శరీరాకృతిపై వేధింపుల్ని ఎదుర్కొన్నారట.. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెబుతూ – ‘‘ఇన్‌ స్టాగ్రామ్‌లో నా శరీరాకృతి విషయంలో వేధింపులకు గురికావడం నాకు కొత్త కాదు.

ఆ మాటకొస్తే ఇన్‌స్టాగ్రామ్‌ లేని రోజుల్లోనే.. నా బాల్యం నుంచే ఇలాంటి వేధింపులను భరిస్తూ వస్తున్నాను. కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని విధంగా కామెంట్లు చేస్తుంటారు. నీ పిరుదుల సైజు ఎంత? సర్జరీ చేయించుకోవచ్చుగా? నీ కాళ్లు అలా ఎందుకున్నాయి? వంటి ప్రశ్నలను సంధిస్తుంటారు. సోషల్‌ మీడియాలో నాకు వచ్చే మెసేజెస్‌లో కనీసం 10 మెసేజ్‌లు ఇలాంటివే ఉంటాయి. ఆ ప్రశ్నలతో నా శరీరం మీద నాకే ఓ నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు ఓ రకమైన భయానికి లోనయ్యేదాన్ని. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల లోపం వల్ల శరీరంలో చాలా రకాలుగా మార్పులు సంభవిస్తుంటాయి.

నా శరీరాకృతిపై అలాంటి కామెంట్లు చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన శరీరాకృతి ఉంటుంది.. అది వారి లోపంగా భావించకూడదనే విషయాన్ని నెటిజన్లు తెలుసుకోవాలి. మాటల రూపంలో నెటిజన్లు పెట్టే హింసను పట్టించుకోవద్దని అనుకొంటాను.. కానీ కొన్నిసార్లు మానసికంగా వేదనకు గురయ్యే కామెంట్లు వినిపిస్తుంటాయి. వేధింపులను తట్టుకోలేక ఓ సందర్భంలో వైద్యులను సంప్రదించాను. ఈ రకమైన సమస్యను డిస్మార్ఫియా అంటారట. ఈ రుగ్మత వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చూసేవాళ్లు కామెంట్‌ చేయడం వల్ల ఓ రకమైన మానసిక సంఘర్షణ ఏర్పడేది. అయితే ఈ మానసిక వేదన అంతా ఒకప్పుడు. ఇప్పుడు ఎవరేమన్నా పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారని కుంగిపోకూడదు. మన గురించి మనం పాజిటివ్‌గా ఆలోచించుకోవాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది’’ అని పేర్కొన్నారు ఇలియానా. కాగా ఇలియానా ప్రస్తుతం రణ్‌దీప్‌ హుడాతో కలిసి ‘అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి
‘బాద్‌షా హో’ (2017), ‘రైడ్‌’ (2018) చిత్రాల్లో అజయ్‌ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. తాజాగా అజయ్, ఇలియానా మరోసారి జోడీ కట్టనున్నారనే టాక్‌ బీ టౌన్‌లో వినిపిస్తోంది. అజయ్‌ దేవగణ్‌ ‘రుద్ర’ అనే వెబ్‌ సిరీస్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో అజయ్, ఇలియానా జంటగా కనిపించనున్నారట. ఇది నిజమైతే వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి జతకట్టినట్లు అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement