
తమిళసినిమా: తనకు శత్రువులు ఉన్నారు.. అని అంటున్నారు నటి నిత్యామీనన్. ఈ మాలీవుడ్ నటి టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోలేకపోయినా, ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్న నటి అని పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా పొగరుబోతు అనే ముద్ర కూడా వేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన ఓకే కణ్మణి చిత్రం సక్సెస్ తరువాత ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించే అవకాశం వస్తే దాన్ని తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అదే విధంగా ఒక మలయాళ చిత్ర షూటింగ్‌లో ఉన్న నిత్యామీనన్‌ను కలవడానికి ఒక నిర్మాత రాగా ఆయన్ని కలవడానికి నిరాకరించిందనే ఘటన అప్పట్లో కలకలం రేకెత్తించింది.
ఇక ఈ మధ్య నటి నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్‌పై రెడ్ కార్డు విధించాలనే వరకూ వచ్చింది. ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్ జీవితంలో చాలానే ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత ఈ సంచలన నటి కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా నటించిన తిరుచిట్రంఫలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి నిత్యామీనన్ పలు విషయాల గురించి మనసు విప్పి చెప్పారు.
అందులో ముఖ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తనకు చాలా మంది శత్రువులు ఉన్నారని అన్నారు. మనం ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని అన్నారు. వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికీ వెనుకాడరన్నారు. నిత్యామీనన్‌తో పని చేయడం చాలా కష్టం అంటారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, ఎవరూ అలా భావించలేదని అన్నారు. కారణం తాను ఎలాంటి వ్యక్తినో వారందరికీ తెలుసని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment