
మెజారిటీ హీరోయిన్లు వరుస సినిమాలతో దూకుడు పెంచుతుంటే ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఈ బ్యూటీ ఇటీవలే వచ్చిన మ్యాడ్ స్క్వేర్‌లో నటించి అలరించింది. తాజాగా ఈ తెలుగమ్మాయి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ.. నేను మొదటగా టాక్సీవాలా సినిమాకు సంతకం చేశాను. ఈ సినిమా కోసం యాక్టింగ్ క్లాసులు తీసుకుంటున్న సమయంలో కల వరం ఆయె చిత్రయూనిట్ నన్ను సంప్రదించారు.
బడ్జెట్ లేదని పారితోషికం వద్దన్నాను
వారు అప్పటికే ఓ హీరోయిన్‌తో షూటింగ్ చేశారట.. కానీ అది నచ్చకపోవడంతో నన్ను సంప్రదించారు. సరే అని చేశాను. అయితే అప్పుడు నాకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి వారి దగ్గర బడ్జెట్ కూడా లేదు. మా దగ్గర రూ.10 వేలు మాత్రమే ఉన్నాయి. బడ్జెట్ లేనప్పుడు ఇవ్వడం దేనికిలే.. అని వద్దన్నాను. నా స్నేహితురాలేమో చేస్తున్న పనికి ఎంతోకొంత తీసుకోవాలి కదా అని వారించింది. దాంతో వాళ్లకు ఫోన్ చేసి ఆ పది వేలు తీసుకుంటానన్నాను.
మొదటి పారితోషికం ఎంతంటే?
నేను వద్దన్నానని వేరేవాటి కోసం కొంత వాడేశాం.. ఇప్పుడు మా దగ్గర రూ.6 వేలే ఉన్నాయని చెప్పారు. అలా నేను తొలి సినిమాకు రూ.6 వేలు తీసుకున్నాను. తర్వాత ఓ యాడ్ కోసం రూ.10 వేలు తీసుకున్నాను. కథ బాగుంటేనే సినిమాలు చేయాలని నియమం పెట్టుకున్నాను. అందుకే గమనం సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ వచ్చింది. టిల్లు స్క్వేర్‌లో 15 సెకన్లు మాత్రమే కనిపించే రోల్ చేశాను. తెలుగు, తమిళంలో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో, ఓ తమిళ సినిమాలో నన్ను చివరి నిమిషంలో తీసేశారు అని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చింది. ప్రియాంక.. టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్‌ఆర్ కళ్యాణమండపం, గమనం సినిమాలు చేసింది.
చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్