![Actress Sunainaa Requests Funds For Treatment Of Producer Avinash Salandra - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/31/sunanina.gif.webp?itok=UV8w9dZt)
సాయం చేయమని అడుగుతూ నటి సునయన సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇప్పటివరకు తనెప్పుడూ ఎవరి సాయం కోరలేదని, కానీ మొట్టమొదటిసారి సాయం అర్థిస్తూ ఈ వీడియోను చేస్తున్నామని చెప్పింది. "పెళ్లికి ముందు ప్రేమ కథ" చిత్ర నిర్మాత అవినాష్ సలంద్ర ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అతడి చికిత్స కోసం ఆర్థిక సాయం అందించమంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
"సాధారణంగా ఇంతవరకూ నేనెవర్నీ సాయం చేయమని అడుగుతూ వీడియో చేయలేదు. కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చింది. కరోనా బారిన పడ్డ అవినాష్ నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మెరుగైన వైద్యం చేయించుకోవాలంటే అతడికి డబ్బు అవసరం. కాబట్టి దయచేసి మీకు తోచినంత డబ్బు ఇవ్వండి. నేనూ కోవిడ్ బారిన పడి కోలుకున్నాను, కాబట్టి అతడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోగలను. చిన్నదో, పెద్దదో ఎంతో కొంత డబ్బు అతడికి పంపి నాకు సాయపడండి. వీలైతే మీకు తెలిసిన వాళ్లకు ఈ వీడియోను షేర్ చేయండి" అని అభ్యర్థించింది. సునయన తెలుగులో కుమార్ వర్సెస్ కుమారి చిత్రంలో నటించింది. చివరిసారిగా 'ఎనై నోకి పాయుమ్ తోట', 'శిల్లు కరుపత్తి' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె 'ఎరియుమ్ కన్నడి', 'ట్రిప్' చిత్రాల్లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment