
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, సింగర్ ఆదిత్య నారాయణ్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. నటి శ్వేతా అగర్వాల్‌ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. డిసెంబర్ 1న ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ వీరి ఏడడుగుల బంధానికి వేదికగా మారింది. ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఉదిత్ ఎన్నో కలలు గన్నా కోవిడ్ ఆయన ఆశల మీద నీళ్లు చల్లింది. ఫలితంగా పెద్ద పెద్ద ఆడంబరాలకు పోకుండా తక్కువ మంది మధ్యే సంబరాలు జరుపుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆయన తన కొడుకు ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు. (చదవండి: దిల్జిత్.. కరణ్ పెంపుడు జంతువు: కంగన)
"నాకు ఏకైక సంతానం ఆదిత్య. వాడి పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలనుకున్నా. కానీ కరోనా వల్ల గ్రాండ్‌గా చేసుకునే వేడుకలకు దూరమవాల్సి వచ్చింది. నిజానికైతే ఈ కరోనా ధాటి తగ్గిన తర్వాతే వాడి పెళ్లి చేద్దామనుకున్నా. కానీ నా కొడుకుతో పాటు శ్వేత, ఆమె కుటుంబం కూడా ఇప్పుడే చేసేద్దామన్నారు. ఆదిత్య, శ్వేత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటున్నా" అని చెప్పుకొచ్చారు. తన కోడలు శ్వేత గురించి చెప్తూ.. 'ఆమె నా కొడుకుకు స్నేహితురాలిగానే తెలుసు. ఓ రోజు ఆదిత్య నా దగ్గరకు వచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఓ క్షణం షాకైన నేను వాడి మాటను కాదనలేకపోయాను. అయితే తర్వాత ఏం జరిగినా నన్ను నిందించొద్దు అని చెప్పాను' అని చెప్పుకొచ్చారు. (చదవండి: శ్వేత అగర్వాల్‌ను పెళ్లాడిన ఆదిత్య)
Comments
Please login to add a commentAdd a comment