
ఊహించని మంచి సంఘటనలు జరిగినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు హీరోయిన్ తమన్నా అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నారు. అతి తక్కువ మంది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఈ మిల్కీబ్యూటీ ఒకరు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న తమన్నా త్వరలో పెళ్లి ముచ్చట్లు చెప్పడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వయా టాలీవుడ్ అంటూ నట ప్రయాణాన్ని సాగిస్తున్న ఈ బ్యూటీ నటిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనుంది. గత ఏడాది తమన్నా నటించిన నాలుగు చిత్రాల్లో మూడు నిరాశ పరిచినా, ఈమెపై ఆ ఎఫెక్ట్ పడకపోవడం విశేషం.
ప్రస్తుతం భాషకో చిత్రం చేస్తూ బిజీగానే ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అందులో రెండు చిత్రాలు సూపర్‌స్టార్స్‌తో నటించడం. అవును తెలుగులో చిరంజీవి సరసన భోళాశంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళ చిత్రం వేదాళంకు రీమేక్. తమిళంలో రజనీకాంత్‌కు జంటగా జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇదే ఆమెను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్న విషయం. చిరంజీవితో ఇంతకు ముందే సైరా చిత్రంలో నటించారు. దీంతో భోళాశంకర్ చిత్రంలో రెండో సారి నటిస్తున్నారు కాబట్టి పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. కానీ రజనీకాంత్‌తో తొలిసారిగా నటించే అవకాశం రావడంతో ఆనంద సాగరంలో తేలిపోతున్నారు.
దీని గురించి తమన్నా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ రజనీకాంత్ సరసన నటిస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. తనలాంటి ఎందరో నటీమణులు రజనీకాంత్‌కు జంటగా నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుండగా జైలర్ చిత్రంలో ఆయనతో కలిసి నటించే అవకాశం తనకు లభించిందన్నారు. షూటింగ్‌లో రజనీకాంత్‌తో కలిసి నటించే సమయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. తలచుకుంటుంటేనే చాలా గర్వంగా ఉందన్నారు. అలాగే రెండోసారి చిరంజీవితో నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. వీటితో పాటు హిందీలో బోల్ చుడియా, మలయాళంలో పాందిరా చిత్రాల్లో నటిస్తున్నారు. మరి ఈ ఏడాదైనా తమన్నాకు కలిసొస్తుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment