హిందీ చిత్రసీమలో అక్షయ్ కుమార్‌కు ‘ఖిలాడీ’ అనే పేరు ఉంది. కారణం అతని లవ్ గేమే. తనకు దగ్గరైన అమ్మాయిలందరికీ ఏకకాలంలో ప్రేమ కబుర్లు చెప్పి.. అందరికీ తనతో పెళ్లి కలలు తెప్పించాడు. వాళ్లలో రవీనా టండన్, శిల్పాశెట్టితో పాటు పూజా బాత్రా, అయేషా జుల్కా వంటి నటీమణులూ ఉన్నారు.
ఇది అక్షయ్ కుమార్ ప్రేమ కథ 2.. ప్రేమిక శిల్పాశెట్టి. ఇదీ ఫెయిల్యూర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విఫలమవడానికి కారణం మాత్రం అక్షయ్ కుమారే. ఆ ప్రేమ మొదలైంది ‘మై ఖిలాడీ తూ అనాడీ’ సినిమా సెట్స్‌లో. అప్పటికే అక్షయ్ సీనియర్. అప్పుడప్పుడే గుర్తింపులోకి వస్తోంది శిల్పాశెట్టి. ఆమె అమాయకత్వం అతణ్ణి ఆకర్షించింది. అతని హాస్యచతురత అమితంగా నచ్చింది ఆమెకు. ఆ మాటల గారడీకి మనసిచ్చేసింది శిల్పాశెట్టి. మూడు జోకులు, ఆరు నవ్వులతో కాలక్షేపం చేయొచ్చులే అని ఆమె మనసు పుచ్చుకున్నాడు అక్షయ్. అప్పటికే అతను రవీనా టాండన్ ప్రేమలో తలమునకలై ఉన్నాడు.
రవీనా ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లాడు. ఇటు శిల్పా తన పట్ల అతను చూపిస్తున్న శ్రద్ధను సీరియస్‌గానే తీసుకుంది. తన కెరీర్ కన్నా అక్షయే ముఖ్యమనుకుంది. అతణ్ణి పెళ్లి చేసుకుని స్థిరపడాలనీ నిర్ణయించుకుంది. రవీనా, శిల్ప ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. అప్పటికే అక్షయ్ ప్రవర్తన పట్ల రవీనాకు ఓ పిక్చర్ వచ్చేసింది. కాని అతని లవ్వాటలో శిల్ప ఉందన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంది. గ్రహించాక అక్షయ్‌తో బంధాన్ని తెంచేసుకుంది. ఇటు శిల్పకు మాత్రం అక్షయ్ అంతరార్థం అర్థం కాక అతణ్ణి రోజూ కొత్తగానే చూడసాగింది.
తెరమీదా ఈ జంటకు క్రేజ్ పెరగడంతో తర్వాత రెండు సినిమాల్లోనూ (ఇన్సాఫ్, జాన్వర్) అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి జత కట్టారు. మూడో సినిమా ‘ధడ్‌కన్’ కూడా మొదలైంది. అప్పుడే అక్షయ్ ప్రవర్తనలోని తేడాను గమనించింది శిల్ప. హడావిడిగా ఉంటున్నాడు. అబద్ధాలు దొర్లుతున్నాయ్. స్నేహంలో అరమరికలు స్పష్టమయ్యే సరికి ఆరా తీసింది శిల్ప. ట్వింకిల్ ఖన్నాతో డ్యుయేట్లు పాడుకుంటున్నట్టు తేలింది. పైగా ఆ రిలేషన్ పట్ల అక్షయ్ సీరియస్‌గా ఉన్నట్లూ సమాచారం అందింది. హతాశురాలైంది శిల్ప. మోసపోయిన భావన .. అతని అవసరానికి తాను పావునయ్యాననే అవమానం.. ఆమె మనసును మెలిపెట్టాయి. పొగిలి పొగిలి ఏడ్చింది.
అప్పటికప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంది. కాని తమ వ్యక్తిగత కారణాలతో ఆ సినిమా యూనిట్ నష్టపోకూడదని సహనం వహించింది. పంటి బిగువున షూటింగ్ పూర్తి చేసింది. సినిమా పూర్తయిన వెంటనే అక్షయ్‌కి గుడ్‌బై చెప్పింది. శిల్పా ఎడబాటు అక్షయ్‌లో ఆవగింజంతయినా అలజడిని రేపలేదని.. ఇసుమంతైనా దిగులు కలిగించలేదని అంటారు అక్షయ్‌తో సన్నిహితంగా మెదిలినవాళ్లు. శిల్పతో తెగతెంపులు అయిన కొద్ది రోజుల్లోనే ట్వింకిల్ పాపిట్లో సిందూర్ అద్ది ‘ఫ్యామిలీ మన్’ ఇమేజ్‌లోకి ఇమిడిపోయాడు.
‘నాతో ప్రేమ నటిస్తూనే అక్షయ్ ఇంకో అమ్మాయితో జీవితాన్ని పంచుకునే ప్లాన్ చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడిలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాను కానీ.. ఆ నిజం తెలిసినప్పుడు నా గుండె బద్ధ్దలైంది. కెరీర్ పరంగా అంతా బాగున్నా వ్యక్తిగతంగా మాత్రం చాలా కుంగిపోయా. ఎలా తట్టుకున్నానో తెలియదు. అక్షయ్ నన్ను యూజ్ చేసుకున్నాడు. తనకు కావల్సిన మనిషి దొరకగానే నన్ను డంప్ చేశాడు. ఈ విషయంలో ట్వింకిల్ పట్ల నాకెలాంటి కంప్లయింట్స్ లేవు. ఉండవు కూడా. నా మనిషి అనుకున్న వ్యక్తే సరైనవాడు కాదు. నా కోపమంతా అతని మీదే. ఏమైనా ఆ కథ తొందరగా ముగిసిపోయినందుకు సంతోషం. నా జీవితంలో నేను మరిచిపోయిన అధ్యాయం అతను. లైఫ్‌లో అతనితో సినిమాలు చేయను’ అని చెప్పింది శిల్పాశెట్టి ఒక ఇంటర్వ్యూలో.
శిల్ప అన్నట్టుగానే ‘ధడ్‌కన్’ ఆ ఇద్దరి ఆఖరి సినిమా అయింది. కిందటేడుకు అది విడుదలై ఇరవై ఏళ్లు. ఆ సందర్భంగా ఆ ఇద్దరూ తమతమ సోషల్ మీడియా అకౌంట్లలో ఆ సినిమా గురించి ‘ధడ్‌కన్ మూవీ మ్యూజిక్‌ని ఇప్పటికీ ఆస్వాదిస్తాను.. ఇట్స్ టైమ్‌లెస్’ అని రాసుకున్నారు.
చదవండి: అందుకే అక్షయ్‌తో బ్రేకప్ తప్పలేదు: రవీనా
చదవండి: మాల్దీవుల్లో భర్తతో ‘సాగర కన్య’
Comments
Please login to add a commentAdd a comment