ఒకప్పుడు హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే ట్రెండ్ నడిచేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో వరుసగా పట్టాలెక్కుతున్నాయి. ఒక్క తెలుగు మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఇండస్ట్రీ మీదనే బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను పడింది. ఇక్కడి సినిమాలను తిరిగి రూపొందిస్తూ ఒరిజినల్ కన్నా పెద్ద హిట్టు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'కాంచన' చిత్రం హిందీలో 'లక్ష్మీ'గా తెరకెక్కింది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు. (చదవండి: నటిపై ట్రోలింగ్: దేవుళ్ల మీదే ఎగతాళా?)
స్టార్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల ఓపెనింగ్ కోసం వేచి చూడకుండా నవంబర్ 9న ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజైంది. అదే రోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, పపువా న్యూగినియా, యూఏఈలో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే ఒకటిన్నర కోట్లు రాబట్టింది. ఫిజిలో 17, ఆస్ట్రేలియాలో 70, న్యూజిలాండ్‌లో 42 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక హాట్‌స్టార్ వీఐపీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కరోనా కాలంలో ఇలాంటి వసూళ్లు రావడం గొప్ప విషయమని విశ్లేషకులు అంటున్నారు కాగా మొదట్లో ఈ చిత్రానికి 'లక్ష్మీ బాంబ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే లక్ష్మీ అంటే పవిత్రమైన పేరు అని, టైటిల్ దాన్ని కించపరిచేలా ఉందని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన సినిమా యూనిట్‌కు నోటీసులు పంపింది. దీంతో చిత్ర యూనిట్ టైటిల్‌ను లక్ష్మీ అని మార్చక తప్పలేదు. (చదవండి: టైటిల్‌లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల)
Comments
Please login to add a commentAdd a comment