నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్
‘అస్సలు తగ్గేదేలే... పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్’ అంటూ సినిమాలో ఉన్నట్లు విడుదలైన అన్ని చోట్లా పుష్పరాజ్ మ్యానియా భారీగా కనిపించింది. సినిమా మొత్తం అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే జాతర సీన్ కి థియేటర్లు ఈలలు కేకలతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ కార్మికుడి నుంచి స్మగ్లింగ్ కింగ్‌పిన్ గా ఎదిగిన పుష్పరాజ్ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీతగా ఎదిగిన అల్లు అర్జున్ ... తొలి భాగాన్ని మించిపోయి రెండో భాగంలో తన సత్తా చూపాడని ప్రేక్షకులు కీర్తిస్తున్నారు.
అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబరు 4 రాత్రి 9 గంటల 30 నిమిషాలకే పుష్పగాడి రూలింగ్ (ప్రీమియర్స్) మొదలైంది.
‘పుష్ప: ది రూల్’ తొలి రోజునే భారీ టాక్ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్ జోష్‌గా ఉంది. గురువారం సాయంత్రం నిర్మాతలు వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్, సీఈవో చెర్రీలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి, తమ ఆనందం పంచుకున్నారు.
తొలి రోజు రూ. 250 కోట్లు?
బాక్సాఫీస్ నివేదికల ప్రకారం ‘పుష్ప 2’ ఇప్పటికే ‘పుష్ప: ది రైజ్’తో సహా పలు చిత్రాల కలెక్షన్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. తొలి రోజు దాదాపు రూ. 250 కోట్ల వసూళ్లు ఖాయం అని గురువారం వసూళ్లను బట్టి అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రం అంచనాలకు అందని విధంగా అనేక రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. దక్షిణాదిలో మాత్రమే కాకుండా, హిందీ మాట్లాడే ప్రేక్షకులు సైతం తొలి పార్ట్‌ని మించి ‘పుష్ప 2: ది రూల్’కి జేజేలు పలుకుతున్నారు.
జాతరే జాతర..
‘పుష్ప 2’ని డాల్బీ, ఐమ్యాక్స్, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ వెర్షన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో విడుదల చేసి, ఆశ్చర్యపరిచారు మేకర్స్. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా విడుదలైన అన్ని ప్రాంతాల్లో థియేటర్లు జాతరను తలపిస్తుండడం విశేషం. బాక్సాఫీస్ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ పుష్ప కలెక్షన్ల వేట సాగుతోంది. బన్నీ (అల్లు అర్జున్) దెబ్బకు పాత రికార్డ్స్ బద్దలైపోతున్నాయి. బుక్ మై షోలో ఒక గంటలో అత్యధికంగా 95.71వేల టికెట్లు విక్రయించిన రికార్డు ఇప్పటిదాకా ప్రభాస్ ‘కల్కి’ పేరిట ఉండగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ దీన్ని అధిగమించింది.
కేవలం ఒక గంటలో 97.74 వేల టికెట్లను విక్రయించడం ద్వారా కొత్త ఆల్–టైమ్ రికార్డును నెలకొల్పింది. మరో విశేషం ఏంటంటే వారాంతపు రోజుల్లో ‘కల్కి’ ఈ రికార్డును సాధించగా, ‘పుష్ప 2’ సాధారణ వారపు రోజున దానిని సాధించడం. ఆల్ ఇండియా బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను అందించే సాక్నిక్ ప్రకారం... ‘పుష్ప 2’ భారతదేశంలో 2,51,9266 టికెట్లను అడ్వాన్స్ బుకింగ్‌లో విక్రయించడం ద్వారా రూ. 73 కోట్లు వసూలు చేసి ‘బాహుబలి 2, జవాన్, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్‌ల అడ్వాన్స్ బుకింగ్‌ను అధిగమించింది.
చదవండి: షారుఖ్‌నే దాటేసిన బన్నీ.. నిజంగా ఇది విధ్వంసమే!
ఉత్తర అమెరికాలో ప్రీ–సేల్స్ 2.5 మిలియన్లను అధిగమించడం కూడా రికార్డే. ప్రస్తుత టాక్‌ని బట్టి సినీ పరిశ్రమ వర్గాలు ‘పుష్ప 2’ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్‌ని అంచనా వేస్తున్నారు. ఇదే వేగంతో మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే వసూళ్లు మొత్తంగా రూ. 800– 1,000 కోట్ల కలెక్షన్లు దాటేసినా ఆశ్చర్యం లేదని పీవీఆర్ ఐనాక్స్ ప్రతినిధి గౌతం దత్తా అంటున్నారు.
ఉత్తరాదిన కూడా వీర విహారం
‘పుష్ప 2: ది రూల్’ ఉత్తరాదిన కూడా వీర విహారం చేస్తోంది. ఈ సినిమా చూసిన ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కునాల్ కోహ్లీ అల్లు అర్జున్, సుకుమార్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్స్టాగ్రామ్‌లో ‘‘అల్లు అర్జున్ మాస్టర్ క్లాస్ పెర్ఫార్మెన్స్ కోసం ‘పుష్ప 2’ చూడండి. రష్మిక ఫ్యాబ్యులెస్. కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్‌కు అర్థం చెబుతూ సుకుమార్ ఒక కంప్లీట్ మసాలా ఎంటర్‌టైనర్‌ని అందించారు. అల్లు అర్జున్ నటనతో ఈ సినిమా బాక్సాఫీస్‌లో కొత్త చరిత్ర లిఖించనుంది’’ అని ఆయన పొగడ్తలతో ముంచెత్తడం ఉత్తరాదిలో ఈ సినిమా ప్రభంజనానికో నిదర్శనం.
చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా.. ఫట్టా?
పుష్ప: ది ర్యాంపేజ్
‘పుష్ప 2’కి కొనసాగింపుగా ‘పుష్ప: ది ర్యాంపేజ్’ రానుంది. అయితే ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్‌లకు వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే ‘పుష్ప: ది ర్యాంపేజ్’ పనులు మొదలవుతాయని ఊహించవచ్చు. ఇక ‘పుష్ప 2’ భారీ విజయంతో ‘పుష్ప 3’ పై భారీ అంచనాలు ఉండటం సహజం.
Comments
Please login to add a commentAdd a comment