‘‘ఇది వరకు మనం సౌత్ సినిమాలు చేస్తే సౌత్ వరకే రీచ్ ఉండేది. కానీ దక్షిణాది సినిమాలు ఉత్తరాదికి వెళ్లేందుకు ‘బాహుబలి’తో బాటలు వేసిన రాజమౌళిగారికి థ్యాంక్స్. ‘పుష్ప, కేజీఎఫ్, కార్తికేయ 2, కాంతార’ సినిమాలు పాన్ ఇండియా వెళ్లడం హ్యాపీ. మన చిత్రాలు దేశమంతా చూస్తుండటం మనకు గర్వకారణం’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 విడుదలకానుంది.
గోపీసుందర్, సూర్యప్రతాప్, వివేక్ కూచిభొట్ల, బన్ని వాసు, సుకుమార్, అనుపమ, అల్లు అర్జున్, నిఖిల్
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌గారు లేకుంటే నా ఈ జీవితం, ఈ ప్రయాణం ఇలా ఉండేది కాదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందుకే ఆయనంటే అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా నాన్నకి(అల్లు అరవింద్) సొంత ఓటీటీ ఉంది. ‘18 పేజెస్’ విడుదల ఆలస్యం అవుతుండటంతో ఓటీటీలో రిలీజ్ చేయమని చాలా మంది చెప్పినా థియేటర్లోనే విడుదల చేస్తున్న ఆయనకి థ్యాంక్స్. ‘18 పేజెస్’ కి గోపీ సుందర్ మంచి సంగీతం ఇచ్చారు. ఇలాంటి వంటి మంచి సినిమా తీసినందుకు సూర్యప్రతాప్‌కి థ్యాంక్స్.
‘హ్యాపీడేస్’ నుంచి నిఖిల్ గ్రాఫ్ చూస్తున్నాను.. చాలా మంచి కథలు ఎంచుకుంటున్నాడు. ఎలా అని ఓ సారి అడిగితే బుక్స్ బాగా చదువుతాడట. నా వ్యక్తిగత అభిప్రాయంలో ఒక యాక్టర్‌కి కావాల్సిన అర్హత ఏంటంటే పుస్తకాలు చదవడం.. అది తనలో చాలా ఉంది. ‘18 పేజెస్’ కి యూనిట్ పెట్టిన కష్టం మీ మనసులను టచ్ చేస్తుంది. ‘పుష్ప 2’ అస్సలు తగ్గేదే లే’’ అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘18 పేజెస్’ వంటి అద్భుతమైన కథని సుకుమార్ రాశాడు. ఇది గీతా ఆర్ట్స్‌లో తీస్తే బాగుంటుందని బన్ని వాసుకి కథ ఇచ్చి, మా గీతా ఆర్ట్స్‌లో సినిమా తీయించినందుకు తనకి థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాత అవుదామని ‘జగడం’ టైమ్‌లో అనుకున్నా. ‘ఆర్య 2’ తీస్తున్నప్పుడు నిఖిల్‌కి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ‘హ్యాపీడేస్’ సినిమా చూసినప్పుడే తను సక్సెస్ అవుతాడనిపించి, ఆ అడ్వాన్స్ ఇచ్చాను. ‘18 పేజెస్’ సక్సెస్ క్రెడిట్ సూర్యప్రతాప్‌దే. ‘పుష్ప 2’ ఐదు రోజులు షూటింగ్ చేశాం’’ అన్నారు.
‘‘అల్లు అర్జున్, సుకుమార్‌లు లేకపోతే బన్ని వాసు అనే వాడు ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదు’’ అన్నారు బన్నీ వాసు. ‘‘పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు సినిమాలు తీసుకెళ్లేలా బాటలు వేసిన దర్శకులు రాజమౌళి సర్, సుకుమార్ సర్‌కి థ్యాంక్స్. ‘18 పేజెస్’ అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది’’ అన్నారు నిఖిల్. ఈ వేడుకలో నిర్మాతలు వై.రవిశంకర్, ‘జెమిని’ కిరణ్, ఎస్‌కేఎన్, వివేక్ కూచిభొట్ల, సంగీత దర్శకుడు గోపీ సుందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment