
Amitabh Bachchan Personal Bodyguard Salary: సెలబ్రిటీలు గడప దాటి బయటకెళ్లాలంటే సెక్యూరిటీ గార్డు ఉండాల్సిందే. లేదంటే అభిమానులు వారిని చుట్టుముట్టేస్తారు. సెల్ఫీలంటూ, చిట్‌చాట్ అంటూ వారిని అంగుళం కదలనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అందుకే చిన్నపాటి సెలబ్రిటీలు కూడా సెక్యూరిటీ గార్డులను మెయింటెన్ చేయాల్సిన పరిస్థితి. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా బయటకెళ్లాలంటే తన చుట్టూ సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే షూటింగ్స్ అయినా, ఈవెంట్ అయినా, విహారమైనా, వేరే ఇతర పనైనా, స్వదేశమైనా, విదేశమైనా.. ఎక్కడికి వెళ్లినా అమితాబ్‌ను నీడలా వెంటాడుతూ అతడికి రక్షణ కల్పించాడో సెక్యూరిటీ గార్డు.
గతేడాది వరకు అతడు బిగ్‌బీ దగ్గరే పని చేశాడు. ఆయన పేరు జితేంద్ర షిండే. ఆయన భార్యకు సొంత సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఉంది. ఇక గతంలో అమితాబ్ కోరిక మేరకు భారత్ పర్యటనకు వచ్చిన అమెరికన్ నటుడు ఎలిజా వుడ్‌కు కూడా షిండే రక్షణ కల్పించాడని సమాచారం. తనను నిరంతరం అంటిపెట్టుకుని ఉండే జితేంద్ర షిండేకు బిగ్‌బీ అక్షరాలా కోటిన్నర రూపాయలు ఇచ్చాడని బాలీవుడ్‌లో వరుస కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటున్నాడు షిండే.
అంతేకాదు, తను ఇప్పుడు అమితాబ్ దగ్గర పని చేయడం లేదని స్పష్టం చేశాడు. 2015లో బిగ్‌బీకు బాడీగార్డుగా నియామకమయ్యానని, ఐతే ఐదేళ్ల సర్వీసు తర్వాత తనను వేరేచోటకు ట్రాన్స్‌ఫర్ చేశారని చెప్పాడు. ప్రస్తుతం తాను దక్షిణ ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నాడు. ఇక అమితాబ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో బ్రహ్మాస్త్ర, ఝండ్, గుడ్‌బై, మేడే సినిమాలున్నాయి. వీటితోపాటు అతడు కౌన్ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment